అదనపు పనులు చేయలేకపోతున్నాం సార్..
చిలకలపూడి(మచిలీపట్నం): ‘అదనపు చేయలేక పోతున్నాం సార్. మా శాఖలోనే రోజూ 54 యాప్‌లను ఓపెన్ చేసి, వాటిలో వివరాలు నమోదు చేయాల్సి ఉంది. ఇవికాక సచివాలయ పరిధిలో అదనపు పనులు అప్పగిస్తున్నారు. వీటితో మాకు పని భారం అధికమవుతోంది. మా పరిస్థితి అర్థం చేసుకుని న్యాయం చేయడి’ అంటూ సచివాలయ హెల్త్ సెక్రటరీలు కృష్ణాజిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీకి సోమవారం గోడు వినిపించారు. తమ శాఖ పరంగా ఉన్న యాప్‌లు, సర్వేలతో పాటు సచివాలయం పరంగా జేఆర్వో ట్యాగింగ్, హౌస్‌హోల్డ్ సర్వే, నాన్ ఏపీ రెసిడెన్స్ ఈ–కేవైసీ, ఫ్యామిలీ మైగ్రేషన్, అప్‌డేట్‌మొబైల్ నంబర్, ఆధార్ ఈ–కేవైసీ, చిల్డ్రన్ విత్ అవుట్ ఆధార్, పించన్ల సర్వేలతో పాటు ప్రస్తుతం పీ4 సర్వే చేయమంటున్నారని వివరించారు. ఈ సర్వేలు చేయాలంటే కష్టమవుతోందని కలెక్టర్ వద్ద వాపోయారు. తమ శాఖపరంగా ఆర్‌సీహెచ్, ఎన్‌సీడీ, ఎన్‌ఎల్‌ఈపీ, శానిటేషన్, ఎన్టీఆర్ వైద్యసేవ తదితర అంశాలతో కూడిన 54 యాప్‌లను రోజూ ఓపెన్ చేసి ఇంటింటికీ తిరిగి ఆయా వివరాలు తెలుసుకుని, వాటిని అప్‌లోడ్ చేస్తున్నామని వివరించారు. వీటితో పాటుగా సచివాలయ అడ్మిన్ల ద్వారా తమకు ఇతర శాఖలకు సంబంధించి సర్వేలను అప్పగిస్తున్నారని పేర్కొన్నారు. కేవలం వైద్య, ఆరోగ్యశాఖకు సంబంధించిన యాప్‌లను నిత్యం అప్‌లోడ్ చేయాలని, ఎటువంటి ఇతర శాఖల సర్వేలు చేయకూడదని వైద్య, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు జీఓ విడుదల చేసినప్పటికీ ఉన్నతాధికారుల ఆదేశాల కారణంగా ఇవి చేయాల్సి వస్తోందని వాపోయారు.
సెలవు అడిగినా ఇవ్వటం లేదు
తమ వ్యక్తిగత పనుల నిమిత్తం సెలవు అడిగినా వైద్యాధికారులు సెలవు ఇచ్చేది లేదని కఠినంగా చెబుతున్నారని హెల్త్ సెక్రటరీలు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఒక హెల్త్ సెక్రటరీ ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకుని కాలిలో ఉన్న రాడ్ తీయించుకునేందుకు సెలవు అడిగినా ఇవ్వడం లేదని వివరించారు. ఇటువంటి పరిస్థితుల్లో తాము ఈ సర్వేలు, యాప్‌లలో వివరాలు నమోదు చేయలేకపోతున్నామని పేర్కొన్నారు. సర్వేల పరంగా ప్రజల ఇళ్లకు వెళ్లినప్పుడు వివరాలు నమోదు చేయడానికి ఓటీపీలు అడిగితే వారు చెప్పటం లేదని వివరించారు. ప్రస్తుత సైబర్ నేరాలు జరుగుతున్న నేపథ్యంలో ఏ కుటుంబీకులు తమకు సహకరించటం లేదని, కొంత మంది ఇప్పుడు వద్దు తరువాత రమ్మంటూ తిరస్కరిస్తున్నారని పేర్కొన్నారు. ఒక్కసారి తమ గురించి ఆలోచించి న్యాయం చేయాలని వేడుకుంటు న్నామని కలెక్టర్ బాలాజీకి విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై కలెక్టర్ బాలాజీ స్పందిస్తూ రాష్ట్ర ఉన్నతాధికారులతో చర్చించాల్సిన అంశమని, దీనిపై మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
మా శాఖలోనే 54 యాప్‌ల్లో రోజూ వివరాలు అప్‌లోడ్ చేయాలి ఇవి కాక అదనంగా మాకు సర్వేలు అప్పగిస్తున్నారు అదనపు సర్వేలు చేయొద్దని జీఓ ఉన్నా పట్టించుకోవడం లేదు కృష్ణా జిల్లా కలెక్టర్ ఎదుట గోడు వినిపించిన హెల్త్ సెక్రటరీలు
Comments
Please login to add a commentAdd a comment