యువజనోత్సవాల్లో సత్తాచాటిన కృష్ణా వర్సిటీ
కోనేరుసెంటర్(మచిలీపట్నం): అంతర విశ్వవిద్యాలయాల జాతీయ యువజనోత్సవాల్లో కృష్ణా యూనివర్సిటీ సత్తాచాటింది. కృష్ణా విశ్వవిద్యాలయం పరిధిలోని విజయవాడ పి.బి.సిద్ధార్థ కళాశాల విద్యార్థులు పాల్గొన్న ఆరు అంశాల్లోనూ ప్రతిభచాటారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయం రెక్టార్ ప్రొఫెసర్ బసవేశ్వరరావు విజేతలకు పతకాలు, ప్రశంసపత్రాలు అందజేశారు. అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ నోయిడాలోని ఎమిటీ వర్సిటీ ప్రాంగణంలో ఈ నెల మూడు నుంచి ఏడో తేదీ వరకు నిర్వహించిన క్లాసికల్, ఓకల్, ఇండియన్ గ్రూప్ సాంగ్, మెహందీ అంశాల్లో కృష్ణా వర్సిటీ తరఫున పీబీ సిద్ధార్థ కాలేజీ విద్యార్థులు ప్రతిభ చాటారు. క్లాసికల్ ఇన్‌స్ట్రుమెంటల్ (తంత్రీవాయిద్యం, పెర్కషన్) విభాగంలో ద్వితీయం, తంత్రీయేతర సంగీతవిభాగంలో తృతీయ, ఫోక్ ఆర్కెస్ట్రా గ్రూప్ సాంగ్‌లో తృతీయస్థానంలో నిలిచారు. పీబీ సిద్ధార్థ సంగీత విభాగంలో జాతీయస్థాయిలో మూడో స్థానంలో నిలిచింది. ఆరేళ్లుగా కృష్ణా యూనివర్సిటీ జాతీయ స్థాయి యువజనోత్సవాల్లో రాణిస్తోంది. గతంలో బెంగళూరులోని జైన్ యూనివర్సిటీలో, లూథియానాలోని పంజాబ్ అగ్రికల్చరల్ వర్సిటీలో జరిగిన అంతర విశ్వవిద్యాలయాల జాతీయ యువజనోత్సవ పోటీల్లో కూడా కృష్ణా వర్సిటీ పక్షాన సిద్ధార్థ ఓవరాల్ చాంపియన్‌గా నిలిచిందని కన్వీనర్ డాక్టర్ బి.జయప్రకాష్, కోఆర్డినేటర్ ఎం.శివరంజని తెలిపారు. విజేతలకు కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కె.రాంజీ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ వేమూరి బాబూరావు, డీన్ ఆచార్య రాజేష్ సి.జంపాల, పీబీ సిద్ధార్థ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మేకా రమేష్, డెంటల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రామోజీ తదితరులు పాల్గొని విజేతలను అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment