ఆదర్శ మహిళా సర్పంచ్‌గా కోటమ్మ
జి.కొండూరు: పురుషులతో సమానంగా మహిళలు రాజకీయాలలో రాణించగలరని భావించి రాజకీయాలలో మహిళలకు యాభైశాతం రిజర్వేషన్‌ను అమలు చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయాలు సాకారమవుతున్నాయి. అవకాశాన్ని అందిపుచ్చుకొని ఎన్టీఆర్ జిల్లా, మైలవరం మండల పరిధి పొందుగల గ్రామ పంచాయతీ నుంచి మొదటి మహిళా సర్పంచ్‌గా ఎన్నికై న గుగులోతు కోటమ్మ విభిన్నమైన ప్రణాళికతో పొందుగలను ఉత్తమ గ్రామ పంచాయతీగా నిలిపి కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డును అందుకున్నారు. సర్పంచ్ కోటమ్మ చదివింది పదో తరగతి. ఏడు ఓట్ల మెజారిటీతో మహిళా సర్పంచ్‌గా గెలుపొందారు. తనకి ఓటు వేసిన వారే కాదు.. ఓటు వేయని వారికి కూడా తాను సర్పంచ్‌ననే భావనతో ఎటువంటి వివక్షకు తావులేకుండా గ్రామాభివృద్ధే ద్యేయంగా పని చేశారు. గ్రామ పంచాయతీలో లేబర్ కాంట్రాక్టరుగా, గుమాస్తాగా పని చేసిన తన భర్త అనుభవాన్ని కూడగట్టుకొని, రాజకీయాలకతీతంగా నిధుల లభ్యతను అందిపుచ్చుకొని, ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చి దిద్దడంలో విజయం సాధించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఒక మహిళగా రాజకీయాలలో పురుషుల కంటే తామేమీ తక్కువ కాదని నిరూపించిన పొందుగల సర్పంచ్ గుగులోతు కోటమ్మకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment