అంతర్ రాష్ట్ర నేరస్తుడు అరెస్ట్
జగ్గయ్యపేటఅర్బన్: రాత్రి సమయాలలో దొంగతనాలు చేేసే అంతర్ రాష్ట్ర పాత నేరస్తుడిని పేట పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ.20 లక్షల విలువైన బంగారు ఆభరణాలను (220 గ్రాములు) స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సీఐ పి.వెంకటేశ్వర్లుతో కలిసి నందిగామ ఏసీపీ తిలక్ వివరాలు వెల్లడించారు. సీఐ పి.వెంకటేశ్వర్లుకు వచ్చిన పక్కా సమాచారం మేరకు శుక్రవారం పేట మండల పరిఽధిలోని గరికపాడు చెక్‌పోస్ట్ వద్ద తెలంగాణ రాష్ట్రం పాండురంగాపురం గ్రామానికి చెందిన సంపతి ఉమాప్రసాద్ అనే నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించి అతని వద్ద నుంచి రూ.20 లక్షల విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఇంటర్ వరకు చదువుకున్న నిందితుడు చిన్ననాటి నుంచే చెడు సావాసాలు చేసేవాడని, తాళం వేసి ఉన్న ఇళ్లలోకి జొరబడి డబ్బు, బంగారాన్ని దొంగతనం చేసి వచ్చిన డబ్బుతో జల్సాలు చేసేవాడన్నారు. ఇతనిపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ రాష్ట్రాల్లో మొత్తం 32 దొంగతనం కేసులు ఉన్నాయని, వీటిలో 25 కేసుల్లో నాన్‌బెయిలబుల్ వారెంట్ పెండింగ్‌లో ఉందని, 12 కేసుల్లో అరెస్ట్ ఎండింగ్‌లో ఉన్నాడన్నారు. గత నెల 19 వ తేదీన జగ్గయ్యపేటలో దొంగతనం చేశాడని, ఆ వస్తువులను నందిగామలో అమ్ముదామని వెళుతుండగా సీఐ వెంకటేశ్వర్లుకు వచ్చిన సమాచారం మేరకు గరికపాడు చెక్‌పోస్టు సమీపంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
చైన్ స్నాచింగ్ కేసులో మరొక నిందితుడు అరెస్ట్...
జగ్గయ్యపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసులో తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా ముత్తవరం గ్రామానికి చెందిన గలంజీపల్లి శేఖర్‌ను అదుపులోకి తీసుకొని విచారించి అతని వద్ద నుంచి 36 గ్రాముల బంగారు గొలుసును స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేసినట్లు ఏసీపీ తిలక్ తెలిపారు. ఈ సందర్భంగా సీఐ పి.వెంకటేశ్వర్లు, ఎస్‌ఐలు రాజు, వెంకటేశ్వరరావులను, వారి సిబ్బందిని నగర పోలీస్ కమిషనర్ అభినందించారు.
ఇంటర్ పరీక్షలకు 710 మంది గైర్హాజరు
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఇంటర్మీడియెట్ పరీక్షలకు సంబంధించి శుక్రవారం జరిగిన పరీక్షలకు 710 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. శుక్రవారం మ్యాథ్స్–2ఏ, సివిక్స్–2, బోటనీ –2 పేపర్లకు సంబంధించిన పరీక్షలు జరిగాయి. వీటికి 36,996 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా అందులో 36,286 మంది హాజరయ్యారు. 710 మంది గైర్హాజరైనట్లు అధికారులు ప్రకటించారు. వొకేషనల్ కోర్సులకు సంబంధించి 1014 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 952 మంది హాజరయ్యారు. 62 మంది గైర్హాజరైనట్లు అధికారులు ప్రకటించారు. జిల్లాలో శుక్రవారం మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదు.
ఓపెన్ స్కూల్ పరీక్షలకు 543 మంది గైర్హాజరు
ఏపీ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో జిల్లాలో జరుగుతున్న ఇంటర్మీడియెట్ పరీక్షలకు శుక్రవారం జిల్లా వ్యాపితంగా 17 పరీక్ష కేంద్రాల్లో పరీక్షను నిర్వహించారు. వాటిలో 2604 మంది విద్యార్థులను కేటాయించగా 2055 మంది హాజరయ్యారు. 543 మంది గైర్హాజరయ్యారు. నగరంలోని గాంధీజీ మున్సిపల్ హైస్కూల్, బీఎస్‌ఆర్‌కే మున్సిపల్ హైస్కూల్, ఏపీఎస్‌ఆర్‌ఎం మున్సిపల్ హైస్కూల్ పరీక్ష కేంద్రాలను డీఈవో సుబ్బారావు శుక్రవారం తనిఖీ చేశారు. తిరువూరు, జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం, విజయవాడ పరీక్ష కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్లు సందర్శించాయి.
Comments
Please login to add a commentAdd a comment