ఎన్టీఆర్ జిల్లాలో నేటి నుంచి పీ4 సర్వే
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్టనర్‌షిప్ (పీ4) విధానానికి ఈ ఏడాది ఉగాది నుంచి శ్రీకారం చుట్టనుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. ఈ నెల 8 నుంచి 18వ తేదీ వరకు గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ప్రత్యేక సర్వే జరుగుతుందని చెప్పారు. ఈ నేపథ్యంలో శుక్రవారం కలెక్టర్ లక్ష్మీశ నోడల్ అధికారులతో కలిసి కలెక్టరేట్ నుంచి పీ4 సర్వేపై వర్చువల్‌గా వర్క్‌షాప్ నిర్వహించారు. పీ4 సర్వే తీరుతెన్నులను పీపీటీ ద్వారా వివరించారు. సర్వేకు సంబంధించి సిబ్బందికి ఇప్పటికే శిక్షణ పూర్తయిందన్నారు. కుటుంబ వివరాలు, సామాజిక, ఆర్థిక స్థితిగతులకు సంబంధించి మొత్తం 27 ప్రశ్నల ద్వారా డేటాను సేకరిస్తారన్నారు. సర్వే అనంతరం మార్చి 21న సమాచార జాబితాలను గ్రామసభలో ప్రదర్శిస్తారన్నారు. పేదరికాన్ని దూరం చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికాయుతంగా చేపడుతున్న కార్యక్రమాలకు అదనంగా సామాజికంగా, ఆర్థికంగా పైన ఉన్న కుటుంబాలు సామాజిక బాధ్యతగా అట్టడుగున ఉన్న కుటుంబాలకు మద్దతుగా నిలిచేలా ప్రోత్సహించడం పీ4 విధానం లక్ష్యమని వివరించారు. కుటుంబాలు ప్రస్తుతం అందుకుంటున్న పథకాలపై ఈ సర్వే ఎలాంటి ప్రభావం చూపదని స్పష్టం చేశారు. అవసరమైతే పథకాల లబ్ధిదారుల జాబితాలో చేర్చడమే తప్ప తొలగించడం జరగదన్నారు. సర్వే ప్రయోజనాలను కుటుంబాలకు క్షుణ్ణంగా వివరించి, కచ్చితమైన డేటాను ఆఫ్‌లైన్, ఆన్‌లైన్లో పొందుపరిచేందుకు ఎన్యూమరేట్లు కృషి చేయాలన్నారు. సర్వే ప్రగతిని డ్యాష్‌బోర్డు ద్వారా జిల్లా, రాష్ట్ర స్థాయిలో పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. సర్వే విజయవంతానికి కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో సీపీవో వై.శ్రీలత, గ్రామ, వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతి, డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీనివాసరావు, జిల్లా పరిశ్రమల అధికారి బి.సాంబయ్య, డీఎంహెచ్‌వో డాక్టర్ ఎం.సుహాసిని, డీపీవో పి.లావణ్య కుమారి, జిల్లా వ్యవసాయ అధికారి డీఎంఎఫ్ విజయకుమారి, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ ఎం.శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు.
క్షేత్రస్థాయి సిబ్బందికి పూర్తయిన శిక్షణ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ
Comments
Please login to add a commentAdd a comment