కొమరవోలులో పర్యటించిన నారా భువనేశ్వరి
కొమరవోలు(పామర్రు): గతంలో తాను దత్తత తీసుకున్న గ్రామమైన పామర్రు మండలం కొమరవోలు గ్రామంలో ఎన్టీఆర్ ట్రస్టు చైర్‌పర్సన్, సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి శుక్రవారం పర్యటించారు. గ్రామ పొలిమేరలో ఆమెకు పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్‌రాజా, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, ఏపీ ఎస్ డబ్ల్యూసీ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, కూటమి నేతలు ఘనంగా స్వాగతం పలికారు. తొలుత తన తల్లిదండ్రులు ఎన్టీఆర్, బసవ తారకం విగ్రహాలకు ఆమె పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గ్రామంలోని శివాలయంలో ఆమె ప్రత్యేక పూజలను నిర్వహించి మొక్కుబడులను చెల్లించుకున్నారు. అనంతరం గ్రామ సచివాలయం వద్ద ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ దిరిశం రత్నకుమారి గ్రామ సమస్యలను తెలియజేశారు. గ్రామంలోని శ్మశాన వాటిక అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని, గ్రామంలో మూడు కిలోమీటర్ల మేర సీసీ రహదార్లు ఏర్పాటు చేయాలని, ఎస్సీ కాలనీ అభివృద్ధి పర్చాలని కోరారు. గ్రామస్తులు వారి వారి సమస్యలను ఆమెకు తెలియజేశారు. భువనేశ్వరి మాట్లాడుతూ గ్రామ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. కార్యక్రమంలో కృష్ణాజిల్లా ప్రాజెక్టు కమిటీ వైస్ చైర్మన్ వల్లూరిపల్లి గణేష్, టీడీపీ మండల అధ్యక్షుడు కుదరవల్లి ప్రవీణ్‌చంద్ర, ఆ పార్టీ నేతలు కాట్రగడ్డ రమేష్‌బాబు, గొట్టిపాటి లక్ష్మీదాసు, కాకరాల హరిబాబు, గ్రామ కార్యదర్శి స్నేహలత తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment