
శోభాయాత్రను అడ్డుకున్న పోలీసులు
వీరులపాడు: శ్రీరామనవమి పండుగ సందర్భంగా వీరులపాడు మండలం అల్లూరు గ్రామంలో మాజీ సర్పంచ్ కోటేరు సూర్యనారాయణరెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ కోటేరు మల్లీశ్వరి ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన ప్రభలను పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరును నిరసిస్తూ గ్రామానికి చెందిన మహిళా భక్తులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తంచేశారు. విషయం తెలుసుకున్న నందిగామ మాజీఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్‌మోహనరావు అక్కడకు చేరుకుని పోలీసుల తీరుపై మండిపడ్డారు. గ్రామంలో టీడీపీ, వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో పండుగ వేడుకలను నిర్వహిస్తుండగా టీడీపీ వారి వేడుకలకు డీజే పర్మిషన్ ఇచ్చి వైఎస్సార్ సీపీ కార్యక్రమానికి పర్మిషన్ లేదనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఒకరికి పర్మిషన్ ఉందని మరొకరికి పర్మిషన్ లేదంటూ పోలీసులు పక్షపాత వైఖరి చూపడం తగదన్నారు. నిష్పక్షపాతంగా పనిచేయాల్సిన పోలీసులు అధికారపార్టీకి కొమ్ముకాస్తుండటం రాజ్యాంగ విరుద్ధమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పండుగ వేడుకలను సైతం రాజకీయకోణంలో చూస్తూ అడ్డంకులు సృష్టించడం ఏమిటని పోలీసులను ప్రశ్నించారు. గ్రామానికి చెందిన మహిళలు పెద్దసంఖ్యలో సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసుల తీరును తప్పుపట్టారు. ఒకరికి మైకు పర్మిషన్ ఇచ్చి మరొకరికి ఇవ్వకపోవటమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం పోలీసులు రహదారిపై నిరసనకు దిగడం చట్టవిరుద్ధమంటూ మహిళలను అక్కడి నుంచి పంపించివేశారు.
రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన మహిళలు
పోలీసుల తీరును ఖండించిన మాజీఎమ్మెల్యే జగన్‌మోహనరావు

శోభాయాత్రను అడ్డుకున్న పోలీసులు