
సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి
విజయవాడస్పోర్ట్స్: విజయవాడ కేంద్రంగా ఎంతో మంది యువతను జాతీయ, అంతర్జాతీయ ఆర్చరీ క్రీడాకారులుగా తీర్చిదిద్దిన ఓల్గా ఆర్చరీ అకాడమీ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని చెరుకూరి ఓల్గా ఆర్చరీ అకాడమీ అధ్యక్షుడు, ఆర్చరీ సీనియర్ కోచ్ చెరుకూరి సత్యనారాయణ డిమాండ్ చేశారు. 2015, 2019లో రెండు పర్యాయాలు సీఎం హోదాలో చంద్రబాబు ఇచ్చిన హామీ అమలుకాకపోవడాన్ని నిరసిస్తూ, మహానాడు రోడ్డు లోని ఓల్గా ఆర్చరీ అకాడమీ వద్ద సోమవారం ఆయన నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2015లో రూ.కోటి ప్రభుత్వ నిధులతో చెరుకూరి ఓల్గా ఆర్చరీ అకాడమీని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తానని, కోచ్‌లకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసి ఇళ్లు నిర్మించి ఇస్తానని, పింఛన్ ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని, ఇదే హామీని 2019 లోనూ ఇచ్చారని గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు హామీలు అమలు జరిగే వరకు దీక్షను కొనసాగిస్తానని ప్రకటించారు. దీక్ష శిబిరాన్ని సీపీఐ విజయవాడ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు సందర్శించి సంఘీబావం తెలిపారు. సీపీఐ నగర సహాయ కార్యదర్శి నక్క వీరభద్రరావు, ఏఐటీయూసీ నగర కార్యదర్శి మూలి సాంబశివరావు, ఏఐవైఎఫ్ నగర కార్యదర్శి లంక గోవిందరాజులు, ఏఐఎస్‌ఎఫ్ నాయకులు ఎం.సాయికుమార్, ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి కె.పి.రావు సంఘీబావం ప్రకటించారు.
ఆర్చరీ సీనియర్ కోచ్ చెరుకూరి సత్యనారాయణ డిమాండ్