
సహకార వ్యవస్థలో రెండంచెల విధానం అమలు చేయాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): సహకార వ్యవస్థ మనుగడ సాగించాలంటే రెండంచెల విధానాన్ని అమల్లోకి తేవాలని రౌండ్‌టేబుల్ సమావేశం తీర్మానించింది. రెండంచెల విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రాల్లో సభలు, సమావేశాలు నిర్వహించాలని, ఐదు లక్షల సంతకాలు సేకరించాలని, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల నుంచి లేఖలు తీసుకోవాలని, విజయవాడలో మహాధర్నా నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది. విజయవాడలోని ఐలాపురం హోటల్‌లో ఏపీ కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డీసీసీబీలను రాష్ట్ర సహకార బ్యాంకులుగా మార్పు చేయాలని, సహకార బ్యాంకింగ్‌లో రెండంచెల విధానం తేవాలని కోరుతూ శనివారం రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ, సీపీఐ, సీపీఎం, రైతు, కార్మిక సంఘాలు, బ్యాంకు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొని రెండంచెల విధానం అమలు చేయాలన్న యూనియన్ డిమాండ్‌కు మద్దతు ప్రకటించాయి. రెండంచెల విధానంలో అటు రైతులకు, ఇటు ఉద్యోగులకు జరిగే మేలును వక్తలు వివరించారు. వ్యవసాయ రుణాల పంపిణీ జాప్యం నివారించడమే కాకుండా వడ్డీ రేట్లు తగ్గుతాయని వక్తలు పేర్కొన్నారు. సహకార వ్యవస్థ మనుగడ సాగిస్తుందన్నారు.
గ్రామీణ పేదలకు మేలు..
రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొన్న వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతంరెడ్డి మాట్లాడుతూ సహకార వ్యవస్థను వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి రావడానికి ముందు, తర్వాత అని రెండుగా విభజించి చూడాల్సి ఉంటుందన్నారు. 2002 సంవత్సరానికి పూర్వం సహకార వ్యవస్థను అప్పటి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. 2004లో అధికారం చేపట్టిన వైఎస్ రాజశేఖరరెడ్డి కుదేలైన సహకార రంగాన్ని ఆదుకొని గాడిలో పెట్టారన్నారు. రూ.వందల కోట్ల ఆర్థిక సాయం అందించి సహకార వ్యవస్థను బతికించారన్నారు. నష్టాల ఊబిలో కూరుకుపోయిన బ్యాంకులను లాభాల బాట పట్టించారని చెప్పారు. సహకార వ్యవస్థలో రెండంచెల విధానం తేవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కేరళ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకొని మన రాష్ట్రంలోనూ రెండంచెల విధానం అమల్లోకి తేవాలన్నారు. ఇందుకు తమ సహకారం ఉంటుందని, ఉద్యోగులకు అండగా ఉంటామన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ సహకార వ్యవస్థలో పెత్తనమంతా రాజకీయ నాయకులదేనన్నారు. ఈ నేపథ్యంలోనే అవినీతి పెరిగిపోయిందన్నారు. ఈ వ్యవస్థలో రెండంచెల విధానం అమల్లోకి తెస్తే గ్రామీణ పేదలకు మేలు జరుగుతుందన్నారు. తక్కువ వడ్డీకే రైతులకు రుణాలు అందుతాయని చెప్పారు. ఏఐటీయూసీ నాయకులు రాధాకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కో ఆపరేటివ్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కేవీఎస్ రవికుమార్, రైతు సంఘం నాయకులు కేశవరావు, కేవీవీ ప్రసాద్, జమలయ్య, భవానీప్రసాద్, బ్యాంకుల ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
రౌండ్‌టేబుల్ సమావేశంలో తీర్మానం
సహకార రంగాన్ని వైఎస్సార్ బతికించారు : పూనూరు గౌతంరెడ్డి