
సింహ వాహనంపై ఆది దంపతులు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): చైత్రమాస బ్రహ్మో త్సవాల్లో ఐదో రోజైన శనివారం శ్రీగంగ, పార్వతి (దుర్గ) సమేత మల్లేశ్వర స్వామి వార్లకు సింహ వాహన సేవ జరిగింది. సాయంత్రం ఐదు గంటలకు ఆలయ ప్రాంగణంలోని మల్లేశ్వర మహా మండపం నుంచి నగరోత్సవ సేవ ప్రారంభమైంది. సింహ వాహనంపై అధిష్టించిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్లకు ఆలయ అర్చకులు పూజలు చేశారు. ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ పర్యవేక్షణలో అర్చకులు పూజలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ వాహన సేవ కనకదుర్గనగర్, రథం సెంటర్, బ్రాహ్మణవీధి, కొత్తపేట, సామారంగం చౌక్, మొయిన్‌రోడ్డు మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. సింహ వాహనంపై దర్శనమిచ్చిన ఆదిదంపతులకు భక్తులు పూజాసామగ్రి సమర్పించారు. ఉదయం మల్లేశ్వర స్వామి ఆలయం వద్ద మూలమంత్ర హవనం, సదస్యం, వేద స్వస్తి జరిగాయి.

సింహ వాహనంపై ఆది దంపతులు