
వేదాంక్షికి గిన్సిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు
మధురానగర్(విజయవాడసెంట్రల్): నగరం లోని కావ్య కౌస్తుభ కుచిపూడి నృత్యాలయం విద్యార్థిని పరమాత్ముని శ్రీవెంకట కృష్ణ వేదాంక్షి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. 2023 డిసెంబర్‌లో హైదరాబాద్‌లో 4,218 మంది కుచిపూడి కళాకారులు క్లాసికల్ ఇండియన్ డాన్స్‌లో ఏడు నిమిషాల పాటు అతిపెద్ద ఏకకాలిక ప్రదర్శన ఇచ్చి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించారు. గురువు డాక్టర్ కోట సరిత మార్గ దర్శనంలో వేదాంక్షి కుచిపూడి కళా వైభవంలో పాల్గొని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో నిలిచింది.
ప్రథమ చికిత్సలపై అవగాహన పెంచుకోవాలి
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రథమ చికిత్స లపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని రాష్ట్ర వైద్యవిద్య సంచాలకుడు డాక్టర్ నరసింహం సూచించారు. ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాలో బేసిక్ లైఫ్ సపోర్టు విభాగం ఆధ్వర్యంలో విద్యుత్ శాఖలో పనిచేసే 60 మంది సిబ్బందికి గురువారం శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ శిక్షణ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న డీఎంఈ డాక్టర్ నరసింహం మాట్లాడుతూ.. అత్యవసర విభాగమైన విద్యుత్ శాఖ ఉద్యోగులకు ప్రథమ చికిత్సపై శిక్షణ అవసరమన్నారు. బీఎల్‌ఎస్ విభాగం నోడల్ ఆఫీసర్ డాక్టర్ సొంగా వినయ్‌కుమార్ మాట్లాడుతూ.. విద్యుత్ షాక్, గుండెపోటు, పాము కాటు వంటి సందర్భాల్లో ప్రథమ చికిత్సలపై వైద్యులు అవగాహన కలిగిస్తున్నట్లు తెలిపారు. అడిషనల్ డీఎంఈ డాక్టర్ డి.వెంకటేష్, ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎ.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.