
టెర్రస్ గార్డెన్ పెంపకంతో ఆరోగ్యకరమైన పంట
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఇంటి టెర్రస్‌పై కూరగాయల పెంపకాన్ని ప్రోత్సహించాలని, తద్వారా రసాయనాలు లేని ఆరోగ్యకరమైన పంట లభిస్తుందని పశ్చిమ ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ (సుజనా) చౌదరి అన్నారు. ఆదివారం సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ (సీటీజీ) ఆధ్వర్యంలో భవానీపురంలోని వాసవి కల్యాణమండపంలో వంటింటి వ్యర్థాలతో సేంద్రియ ఎరువును తయారు చేసుకుని కూరగాయలు పెంచటంపై అవగాహన సదస్సు జరిగింది. ముఖ్యఅతిథిగా సుజనా చౌదరి మాట్లాడుతూ ప్రతి కుటుంబం తమకు అవసరమైన కూరగాయలను ఎటువంటి రసాయన ఎరువులు లేకుండా వంటింటి వ్యర్థాలతో కంపోస్ట్ ఎరువును తయారు చేసుకుని పండించుకోవాలని, తద్వారా ఆరోగ్యమైన జీవితాన్ని పొందవచ్చని తెలిపారు. టెర్రస్ గార్డెనింగ్‌పై యువత ఆసక్తి పెంచుకోవాలన్నారు. ప్రత్యేక అతిథిగా హాజరైన పర్యావరణవేత్త మద్దుకూరి సుబ్బారావు మాట్లాడుతూ కిచెన్‌లో కూరగాయలతో వంట చేసినప్పుడు వచ్చే వ్యర్థాలను బయట పడేయకుండా వాటిని కంపోస్ట్ ఎరువుగా తయారు చేసుకోవచ్చన్నారు. ఎటువంటి రసాయనాలు వాడకుండా పండే కూరగాయలను తినటం వలన మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చన్నారు. అంతేకాకుండా పర్యావరణాన్ని కాపాడినవారం అవుతామని అన్నారు. సదస్సుకు ఏపీఎఫ్‌సీసీఐ అధ్యక్షుడు వక్కలగడ్డ భాస్కరరావు అధ్యక్షత వహించారు. సీటీజీ వ్యవస్థాపకుడు శ్రీనివాస్, విజయవాడ టీమ్ పీవీడీ నాగేశ్వరరావు, గూడవల్లి సురేష్‌బాబు, నర్రా నాగేంద్రప్రసాద్, పద్మజ, జి.పద్మాదేవి పాల్గొన్నారు.