
క్రీస్తు పునరుత్థానం..లోకానికి శుభోదయం
గుణదల(విజయవాడ తూర్పు): మానవాళి రక్షణార్ధమై యేసుక్రీస్తు సిలువ మరణాన్ని జయించి పునరుత్థానుడయ్యాడని మేరీమాత పుణ్యక్షేత్ర రెక్టర్ ఫాదర్ యేలేటి విలియం జయరాజు అన్నారు. గుణదల మాత ప్రధానాలయంలో ఈస్టర్ పండుగ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. పునరుత్థానుడైన యేసు క్రీస్తును ఆరాధించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. అనేక ప్రాంతాల నుంచి యాత్రికులు రావడంతో పుణ్యక్షేత్రం సందడిగా మారింది. ఈ సందర్భంగా ఆలయంలో సమష్టి దివ్యబలి పూజ నిర్వహించారు. భక్తులనుద్దేశించి ఫాదర్ జయరాజు మాట్లాడుతూ క్రీస్తు పునరుత్థానం లోకానికి జయమన్నారు. మానవాళిని రక్షించేందుకే యేసుక్రీస్తు సిలువ మరణం పొందారని గుర్తు చేశారు. యేసుక్రీస్తు మన కొరకు చేసిన త్యాగాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని, ఆయన ఆచరించి చూపిన మార్గంలో నడుచుకోవాలన్నారు. ఈస్టర్ పండుగ అందరి జీవితాలలో దీవెనలు నింపాలని ఆశీర్వదించారు. అనంతరం సమష్టి దివ్యబలి పూజ సమర్పించి భక్తులకు సత్ప్రసాదాన్ని అందజేశారు. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులతో పాటు యాత్రికులు కూడా పెద్ద సంఖ్యలో పుణ్యక్షేత్రానికి తరలివచ్చారు. కాలి నడకన కొండ శిఖరాగ్రం వరకు వెళ్లి క్రీస్తును వేడుకున్నారు. పుణ్యక్షేత్రానికి వచ్చిన భక్తుల కోసం ఆలయ గురువులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

క్రీస్తు పునరుత్థానం..లోకానికి శుభోదయం

క్రీస్తు పునరుత్థానం..లోకానికి శుభోదయం