
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
మలేరియా, డెంగీ రహిత జిల్లాగా తీర్చిదిద్దండి
గాంధీనగర్ (విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాను మలేరియా, డెంగీ రహితంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ జి.లక్ష్మీశ ఆదేశించారు. జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమంలో భాగంగా ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని చేపట్టాల్సిన కార్యక్రమాలపై కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ లక్ష్మీశ జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 25వ తేదీ ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో దోమల వ్యాప్తిని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. సచివాలయ స్థాయిలో ప్రతి కుటుంబానికి దోమల వ్యాప్తిపై రూపొందించిన కర్ర పత్రాన్ని వైద్య ఆరోగ్య, సచివాలయ అధికారులు తప్పనిసరిగా అందించి అవగాహన కల్పించాలన్నారు. 2030 నాటికి దేశ వ్యాప్త మలేరియా నిర్మూలన లక్ష్యానికి ముందే మలేరియా, డెంగీ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలన్నారు.ఈ సమావేశంలో విజయవాడ మునిసిపల్ కమిషనర్ హెచ్.ఎం.ధ్యానచంద్ర, డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎం.సుహాసిని, అదనపు డీఎంహెచ్‌ఓ డాక్టర్ జూపూడి ఉషారాణి, జిల్లా మలేరియా అధికారి మోతిబాబు, డీపీఓ పి.లావణ్య కుమారి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డీఎంఎఫ్ విజయ కుమారి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) అధ్యక్షుడు డాక్టర్ బి.హనుమయ్య, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ కె.వి.ఎస్.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరపత్రాలను ఆవిష్కరించారు.