గూడ్సు రైలు ఢీకొని ఇద్దరు దుర్మరణం
భువనేశ్వర్: రైల్వే లెవెల్ క్రాసింగ్ గేటు దాటుతుండగా సరుకు రవాణా రైలు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి విషమంగా ఉంది. వీరంతా 2 వేర్వేరు బైక్‌ల మీద వెళ్తూ రైలు పట్టాలు దాటుతుండగా ప్రమాదానికి గురయ్యారు. రౌర్కెలా కళుంగా రైల్వే లెవెల్ క్రాసింగు గేటు దగ్గర మంగళవారం రాత్రి పూట ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బ్రాహ్మణి తరంగ్ ఠాణా పోలీసులు, ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్‌పీ) ఉమ్మడిగా కేసుపై విచారణ చేపట్టారు. గాయపడిన వారిని చేరువలో ఉన్న ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించి ఉన్నత చికిత్స కోసం రౌర్కెలా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృత దేహాల్ని పరీక్షల కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితులంతా కళుంగ ప్రాంతంలో పని చేస్తున్నారు. మృతుల్లో ఒకరిని ఝార్ఖండు మరొకరిని అస్సాం ప్రాంతీయుడిగా గుర్తించారు. చికిత్స పొందుతున్న వారి పరిస్థితి విషమంగా కొనసాగుతుందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఈ ప్రమాదంపై స్థానికులు తీవ్రంగా మండి పడ్డారు. దీర్ఘకాలంగా ఈ ప్రాంతంలో ఓవరు బ్రిడ్జి నిర్మాణం కోసం చేస్తున్న అభ్యర్థనల్ని పెడ చెవిన పెట్టి పలువురి ప్రాణాల్ని బలిగొంటున్నారని విరుచుకు పడ్డారు. దీంతో ఘటనా స్థలంలో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది.
మరో ఇద్దరి పరిస్థితి విషమం
Comments
Please login to add a commentAdd a comment