
కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు అన్యాయం
పార్వతీపురం టౌన్: కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకాలను, జీతాల చెల్లింపు ప్రక్రియను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని జేఏసీ జిల్లా కన్వీనర్ బీవీ రమణ డిమాండ్ చేశారు. పార్వతీపురంలోని సుందరయ్య భవనంలో శనివారం జిల్లా కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, డైలీ వేజ్, కంటింజెంట్ ఉద్యోగుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, కార్మికులకు నష్టం చేకూర్చే విధంగా అనేక నిర్ణయాలు చేస్తున్నదని విమర్శించారు. ప్రస్తుతం ఆప్కాస్ పద్ధతిలో కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల నియామకాలు జరుపుతున్న నేపథ్యంలో ఈ విధానాన్ని మార్చి రాష్ట్రంలో ప్రస్తుతం పని చేస్తున్న 2.50 లక్షల కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, డైలీ వేజ్ ఉద్యోగుల భవితవ్యాన్ని ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించి, వారి ద్వారా కొత్త నియామకాలు, జీతాలు చెల్లించే విధంగా ప్రభుత్వం నిర్ణయం చేసిందన్నారు. ఇదే జరిగితే రాష్ట్రంలోని కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, డైలీ వెజ్ కంటెంజెంట్ ఉద్యోగులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. సకాలంలో జీతాలు కూడా చెల్లించే పరిస్థితి ఉండదని, పీఎఫ్, ఈఎస్‌ఐ, కూడా అమలు చేయరని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేట్ ఏజెన్సీలు రాజకీయ నిరుద్యోగ పునరావస కేంద్రాలుగా మారి ఉద్యోగులకు రాజకీయ వేధింపులు, తొలగింపులు పెరిగే ప్రమాదం ఉందన్నారు. ఈ విధానానికి వ్యతిరేకంగా కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్, ఉద్యోగులు, కార్మికులు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జేఏసీ కో చైర్మన్ బి.ఈశ్వరరావు, పోలినాయుడు, ఆనందరావు అభిరామ్, గణపతి, విజయనగరం జిల్లా జేఏసీ నాయకులు జి.అప్పలసూరి, సీఐటీయూ జిల్లా కోశాధికారి గొర్లి వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment