
పరీక్షల కాలం..యోగాసనాలతో ఏకాగ్రత
ఏకాగ్రత పెరుగుతుంది
యోగాసనాలతో విద్యార్థుల్లో మానసిక పరివర్తనతో పాటు, శారీరక పెరుగుదల ఉండి, ఏకాగ్రత పెరుగుతుంది. ఉజ్వల భవిష్యత్‌కు యోగా దోహదపడుతుంది. యోగాసనాలు వలన విద్యార్థులు క్షణికావేశానికి గురికాకుండా ఒత్తిడిని జయించగలుగుతారు. ప్రతి దినం సాధనం చేస్తే ఏకాగ్రత సాధించవచ్చు. పరీక్షలలో నిర్భయంగా ప్రశ్నలకు సమాధానాలు రాయగలుగుతారు.
– కె.జనార్ధనరావు, యోగా గురువు, తలవరం జెట్పీహెచ్‌ఎస్, వీరఘట్టం
మానసిక ప్రశాంతత
యోగాసనాలు వలన విద్యార్థుల్లో మానసిక ప్రశాంతత కలుగుతుంది. మార్కుల కోసం కుస్తీ పడుతున్న ఈ పోటీ ప్రపంచాన్ని ఎదుర్కోవాలంటే విద్యార్థులకు యోగాయే సరైన మార్గం. దీని వలన జ్ఞాపకశక్తి పెరిగి విద్యార్థులు పరీక్షలను ధైర్యంగా రాయవచ్చు.
– శిర్లాపు ఉమామహేశ్వరరావు, పీడీ, బాలుర ఉన్నత పాఠశాల, వీరఘట్టం
● ఒత్తిడిని జయించవచ్చు..
● ప్రాణాయామం.. ఎంతో ప్రయోజనం
● రోజూ 25 నిమిషాలు చేస్తే
ఎంతో మేలు
● ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుదల
వీరఘట్టం: విద్యార్థులకు ఇది పరీక్షల కాలం. మార్చి 1 నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు, మార్చి 17 నుంచి పదో తరగతి పరీక్షలు. నీట్ నుంచి ఐఐటీ వరకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఇది కష్టకాలం. అన్నింటికి మార్కులతో కుస్తీ పడాలి. ఇది కేవలం జ్ఞాపకశక్తితో చేసే పోరాటం కాదు. ప్రశాంత చిత్తానికి ఏకాగ్రతకు లంకె కుదరాలి. లక్ష్య సాధనకు అలుపెరగని ప్రయత్నానికి అన్వయం సరిపోవాలి. పుస్తకాలు ముందేసుకొని గంటల కొద్ది కుస్తీ పడితే సాగిపోయే వ్యాసంగం కాదిది. మనలోని అణువనువు చైతన్యవంతమైతే లక్ష్యం పాదాక్రాంతమవుతుంది. అలాంటి శక్తులను నిచ్చేది విద్యార్థిలో అనంత శక్తులను నింపగలిగేది యోగా ఒక్కటేనని నిపుణులు చెబుతున్నారు. యోగాలో ప్రాణాయామం, ఆసనం వంటి ప్రక్రియలు ఉన్నాయి. వీటిని రోజుకు 25 నిమిషాలు సాధన చేస్తే చాలు ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరగటంతో పాటు శారీరక రుగ్మతలు దూరమవుతాయి. ఆత్మ విశ్వాసం పెంపొందుతుంది. పరీక్షలో మంచి మార్కులు సాధించడానికి దోహదపడుతుందని యోగా గురువులు చెబుతున్నారు. ఇందులో భాగంగా మండలంలోని వీరఘట్టం, తలవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రతీ రోజూ పదో తరగతి విద్యార్థులు 25 నిమిషాల పాటు యోగాసనాలు వేస్తూ ఏకాగ్రతను తమ సొంత చేసుకుంటున్నారు.
ప్రాణాయామం
పిల్లల్లో ఒత్తిడిని దూరం చేసేందుకు జ్ఞాపకశక్తి, చక్కటి ఆరోగ్యం ఏకాగ్రత పెంపొందించడంలో ప్రాణాయామం ఉపయోగపడతా యి. ఇది కళ్లు మూసుకొని పద్మాసనంలో ని టారుగా కూర్చొని శ్వాసపైనే ధ్యాస ఉంచి చే యాల్సినవి. తాటక క్రియ, ఓంకాయ ఉచ్ఛార ణ కూడా మంచి ఫలితాలను ఇస్తాయి. ఇవన్నీ 10 నుంచి 12 నిమిషాలు చేయాలి.
భ్రమిరి
పద్మాసనం(సిద్ధాసనం)లో నేలపై కూర్చొని చేతులు బ్రొటన వేలుతో చెవులను మూసి, చూపుడు వేలును నుదిటిపై ఉంచాలి. మిగిలిన మూడు వేలుతో కళ్లు మూయాలి. తర్వాత దీర్ఘశ్వాస తీసుకొని గొంతు ద్వారా తుమ్మెద నాదం చేస్తూ నెమ్మదిగా ముక్కు ద్వారా శ్వాసను వదలాలి.
ఉద్గిత్
పద్మాసనంలో చిన్ముద్రతో దీర్ఘశ్వాస తీసుకోవాలి. ఓం అంటూ శబ్దం చేస్తూ శ్వాసను వదలాలి. ఇలా చేయడం ద్వారా ఏకాగ్రత పెరుగుతుంది.
ప్రణవ
పద్మానసం వేసుకొని ధ్యానం చేస్తున్నట్లు కళ్లు మూసుకొని కూర్చోవాలి. మనసును అదుపులోనికి తీసుకొచ్చిన తర్వాత చదివిన అంశాలను మననం చేసుకోవాలి. దీని ద్వారా మతిమరుపు సమస్య దూరం చేయవచ్చు.
బస్త్రిక
పద్మాసనం వేసి వెన్నుముకను నిటారుగా ఉంచి కూర్చోవాలి. కళ్లు మూసుకొని దీర్ఘ శ్వాస తీసుకోవడం, నెమ్మదిగా వదలడం చేయాలి. ఇలా చేయడం ద్వారా ఒత్తిడిని అధిగమించి జ్ఞాపకశక్తిని పెంపొందించుకోవచ్చు.
అనులోమ, విలోమ
పద్మానసంలో కూర్చొని ఎడమచేతిని జ్ఞాన ముద్రలో ఉంచాలి. కుడి చేతి బొటనివేలును కుడి నాసికను మూసి ఎడమ నాసిక ద్వారా నెమ్మదిగా దీర్ఘ శ్వాస తీసుకోవాలి. తర్వాత కుడి నాసికపై బొటన వేలిని తీసేసి ఎడమ నాసికను మూడు వేలుతో మూసి నాసికల ద్వారా నెమ్మదిగా శ్వాస వదలాలి. అలా కుడి, ఎడమ నాసికల ద్వారా శ్వాస ప్రక్రియ చేయాలి. దీనివల్ల జ్ఞాపకశక్తి పెరగడంతో పాటు మానసిక రుగ్మతలు తొలుగుతాయి.
తాటక ప్రక్రియ
వజ్రాసనంలో నిటారుగా కూర్చోవాలి. ఎదురుగా రెండు అడుగుల దూరంలో దీపం లేదా గోడకు బొట్టు పెట్టి దానిపై దృష్టి పెట్టాలి. అలా కాని పక్షంలో కుడి చేతి బొటనవేలిని ముందుకు చాచి ఆ వేలిపైనే ఏకాగ్రతతో దృష్టిని నిలపాలి. ఇలా సాధన చేయడం వల్ల భవిష్యత్‌లో కంటి సమస్యలు రాకుండా నివారించవచ్చు.
నిత్య సాధన చేయాలి
యోగాసనాలతో పాటు ప్రాణాయామం నిత్య సాధన చేయడం ద్వారా ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. పరీక్షల సమయంలో సాధారణంగా తలెత్తే ఒత్తిడి సమస్యలను అధిగమించవచ్చు. దీని వల్ల పరీక్షలకు బాగా సిద్ధమవ్వొచ్చు. మంచి మార్కులు సాధించవచ్చు.

పరీక్షల కాలం..యోగాసనాలతో ఏకాగ్రత

పరీక్షల కాలం..యోగాసనాలతో ఏకాగ్రత
Comments
Please login to add a commentAdd a comment