పార్వతీపురం: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పదవ తరగతి విద్యార్థులు ఇష్టంతో చదవాలని, కష్టంతో కాదని, ఆ దిశగా విద్యార్థులను తీర్చిదిద్దాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ అన్నారు. ప్రతి ఏడాదిలాగానే ఈ ఏడాది కూడా పదో తరగతి ఉత్తీర్ణత శాతంలో రాష్ట్రస్థాయిలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులను కోరారు. మై స్కూల్–మై ప్రైడ్‌పై హెచ్‌ఎం, టీచర్స్‌తో కలెక్టర్ ఆదివారం టెలికాన్ఫరెనన్స్ నిర్వహించారు. పాఠ్యాంశాలపై ప్రతి విద్యార్థి సంపూర్ణ విజ్ఞానం కలిగి ఉండాలని, ఆ విధంగా చేయడమే మై స్కూల్–మై ప్రైడ్ ఉద్దేశ్యమని పేర్కొన్నారు. పదవ తరగతి చదివే విద్యార్థుల ఉత్తీర్ణతా శాతం పెంచడం కోసం దీన్ని రూపొందించినట్లు చెప్పారు. పదవ తరగతికే పరిమితం కాకుండా మై స్కూల్–మై ప్రైడ్ ప్లస్ గా రూపొందించి అన్ని తరగతుల విద్యార్థులకు పాఠ్యాంశాలలో సంపూర్ణ విజ్ఞానం కలిగేలా తీర్చిదిద్దడం, ఆటలు, వ్యాసరచన, చర్చలు, సైన్స్ ఫెయిర్స్‌లో విద్యార్థులు పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. సబ్జెక్టుల వారీగా ఎక్కడా టీచర్స్ కొరత లేకుండా సర్దుబాటు చేశామని, విద్యార్థులకు బోధన విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు.వెనుకబడిన విద్యార్థులను గుర్తించి, ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. తొలుత పాఠ్యంశాలపై విద్యార్థులకు ప్రశ్నలు వేసి సమాధానాలు అడిగి తెలుసుకోవాలని, పదవ తరగతి చదువు అనంతరం ఉపాధి అవకాశాలు లభించే కోర్సులపై అవగాహన కల్పించాలని కోరారు. సమావేశంలో ఉప, మండల విద్యాశాఖాధికారులు, పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment