రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
జయపురం: జయపురం సబ్‌డివిజన్ బొరిగుమ్మ పోలీసు స్టేషన్ కెరాపుట్ గ్రామ సమీప రోడ్డులో పార్క్ చేసి ఉన్న ఒక నీలగిరి కలప ట్రక్కును వెనుక నుంచి ఒక బైక్ ఢీకొనటంతో ఇద్దరు వ్యక్తులు మరణించగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. బుధవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో మరణించిన వ్యక్తులు బొదాగుడ గ్రామానికి చెందిన లక్ష్మణ పొరజ, కుమ పోరజ అని పోలీసు అధికారి సూరత్ ప్రధాన్ తెలిపారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తి బొదాగాం వాసి పూర్ణ అని, వెంటనే అతడిని బొరిగుమ్మ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. పోస్టు మార్టం జరిపిన తరువాత వారి కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పజెప్పారు. బొరిగుమ్మ పోలీసు అధికారి సూరత్ ప్రధాన్ తెలిపిన వివరాల ప్రకారం..
బుధవారం బొదాగుడ ప్రాంత నుంచి లక్ష్మణ పోరజ, కుసు పొరజ, పూర్న పొరజలు ఒక బైక్‌పై బిజసింగపూర్‌లో ఒక వివాహ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారు. వారు రాత్రి తిరిగి తమ గ్రామానికి వస్తుండగా కెరాపుట్ గ్రామ సమీపంలో నీలగిరి కలప రవాణా చేస్తున్న ఒక ట్రక్కు నిలిపి ఉంది. ఆ విషయం తెలియని బైక్ నడుపుతున్న వ్యక్తి నేరుగా ట్రక్కు వెనుక నుంచి ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో సంఘటనా స్థలం వద్దే లక్ష్మణ, కుములు మరణించారని పోలీసు అధికారి వెల్లడించారు. మరో వ్యక్తి పూర్ణ తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా ప్రాంతానికి చేరుకొని పూర్ణను బొరిగుమ్మ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. రెండు వాహనాలను సీజ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment