మక్కువ: ఈ రోజు నుంచి నా జోలికి వచ్చినా.. మా నాయకులు, మినిస్టర్ గురించి రాసినా నీ ఇంటికొచ్చి చంపేస్తామని టీడీపీ మండల అధ్యక్షుడు గుల్ల వేణుగోపాల్‌నాయుడు ప్రజాశక్తి విలేకరి మల్యాడ రామారావును బెదిరించారు. పైగా ఆదివారం ఉదయం మండలంలోని వెంగంపేట – కాశీపట్నం మధ్యలో రామారావుపై దాడి కూడా చేశారు. టీడీపీ మండలాధ్యక్షుడు బెదిరించిన వాయిస్ రికార్డు అన్ని సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేయడంతో సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇదిలా ఉండగా టీడీపీ మండల అధ్యక్షుడు గుల్ల వేణుగోపాల్‌నాయుడు తనపై దాడి చేశారంటూ ప్రజాశక్తి విలేకరి రామారావు మక్కువ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఎస్సై వెంకటరమణ వద్ద ప్రస్తావించగా.. టీడీపీ మండలాధ్యక్షుడు వేణుగోపాల్‌నాయుడు నుంచి రక్షణ కల్పించాలని విలేకరి రామారావు ఫిర్యాదు చేసిన మాట వాస్తవమేనన్నారు. కోర్టు అనుమతితో కేసు నమోదు చేసే అవకాశం ఉన్నందున, ప్రస్తుతానికి ఫిర్యాదు స్వీకరించామని చెప్పారు.
దాడిని ఖండించిన జర్నలిస్టు సంఘాలు..
ప్రజాశక్తి విలేకరి మల్యాడ రామారావుపై టీడీపీ మక్కువ మండల అధ్యక్షుడు గుల్ల వేణుగోపాల్‌నాయుడు దాడి చేయడాన్ని జర్నలిస్తు సంఘాలు ఖండించాయి. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి పీఎస్‌ఎస్‌వీ ప్రసాద్, జిల్లా అధ్యక్షుడు అల్లు సూరిబాబు, ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు కె.రమేష్‌నాయుడు, జాప్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అవనాపు సూరిబాబు, తెలుగు జర్నలిస్టు ఫోరం అధ్యక్షుడు ఎంఎంఎల్ నాయుడు, విజయనగరం వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు జి.కోటేశ్వరరావు, తదితరులు దాడిని ఖండించారు.
విలేకరిని బెదిరించిన టీడీపీ మండల అధ్యక్షుడు
పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు
భౌతికదాడులు సరికాదు..
జర్నలిస్ట్‌లపై భౌతికదాడులు సరికాదు. విలేకరులు తప్పుడు వార్తలు రాస్తే, ప్రెస్‌మీట్‌లలో, పబ్లిక్ సమావేశాల్లో అడగడం మంచి పద్ధతి. అంతేగాని కక్షపూరితమైన చర్యలు చేపట్టడం మంచి సంస్కారం కాదు. అటువంటి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. కొంతమంది కూటమి ముఖ్య నేతలు సైతం వారికి అనుకూలంగా వార్తలు రాయడం లేదన్న కారణంతో దాడులకు తెగబడుతున్నారు. ఈ సంస్కృతి సరైంది కాదు.
– పీడిక రాజన్నదొర, మాజీ డిప్యూటీ సీఎం
మంచి పద్ధతి కాదు..
విలేకరులు వారి వృత్తిరిత్యా వార్తలు రాస్తుంటారు. అందులో కొన్ని అనుకూలంగా ఉంటాయి.. మరికొన్ని ప్రతికూలంగా ఉంటాయి.. వాటిని రాజకీయ నాయకులు చూసి దిద్దుబాటు చర్యలు చేపట్టుకోవాలే తప్ప, వారిపై దాడులు చేయడం మంచి పద్ధతి కాదు. విలేకరిపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి.
– మావుడి శ్రీనివాసరావు,
జెడ్పీటీసీ సభ్యుడు, మక్కువ
Comments
Please login to add a commentAdd a comment