నరసన్నపేటలో గంజాయి కలకలం
నరసన్నపేట : నియోజకవర్గ కేంద్రం నరసన్నపేటలో గంజాయి వినియోగం ఒక్కసారి బట్టబయలైంది. ఒకేసారి 9 మంది అరెస్టు కావడంతో కలకలం రేగింది. స్థానికంగా గంజాయి అమ్మకాలు, వినియోగం జరుగుతుందని గమనించిన పోలీసులు దీనిపై నిఘా వేశారు. ఆర్టీసీ కాంప్లెక్స్‌తో పాటు పలు ప్రాంతాల్లో గంజాయి అక్రమంగా చేతులు మారుతున్నట్లు అనుమానంతో ఇటీవల సోదాలు చేశారు. అప్పట్లో ఏమీ లభించలేదు. శనివారం స్థానిక వెంకటేశ్వరాలయం ఎదురుగా రాజులు చెరువు గట్టుపై ఉన్న వీధిలో పసుపుల రమణ ఇంటి వద్ద కొందరు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. వీరి వద్ద రూ.66 వేల విలువైన 22 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో కొందరు గంజాయిని వినియోగిస్తున్నారు. వీరిని విచారించగా మిగిలిన వారూ పట్టుబడ్డారు. ఈ మేరకు కేసు నమోదు చేసి 9 మంది నిందితులను కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ జె.శ్రీనివాసరావు ఆదివారం తెలిపారు. స్థానిక ట్యాంకు బండ్ వీధికి చెందిన కోట ప్రతీప్, శ్రీరాంనగర్‌కు చెందిన లిమ్మా రాహుల్, పెద్దపేటకు చెందిన అరసవల్లి వరప్రసాద్, జగన్నాథపురానికి చెందిన దనిమిశెట్టి అజయ్, హనుమాన్‌నగర్‌కు చెందిన గొడ్డు రాఘవేంద్ర, బొంతల వీధికి చెందిన పొన్నాడ అజయ్, మేదర వీధికి చెందిన బెహరా హరి, శ్రీకాకుళం సానా వీధికి చెందిన తట్టా హేమంత్, పోలాకి గొల్లలవలసకు చెందిన దంత పునీత్‌లను అరెస్టు చేసినట్లు సీఐ వివరించారు. వీరి వద్ద రెండు ద్విచక్ర వాహనాలు, 9 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
● 22 కేజీలు స్వాధీనం.. 9 మంది అరెస్టు
Comments
Please login to add a commentAdd a comment