దివ్యాంగ చిన్నారిపై కుక్కల దాడి
పొందూరు : పొందూరు పరిధిలోని అలబోయినపేట మంగళకాలనీ సమీపంలో కుక్కలు మూకుమ్మడిగా చేసిన దాడి చేయడంతో ఎనిమిదేళ్ల దివ్యాంగ చిన్నారి సెనగల శ్యామల తీవ్రంగా గాయపడింది. మూగ, చెవిటి సమస్యతో బాధపడుతున్న శ్యామల స్నేహితులతో కలిసి సమీపంలో పెళ్లి విందుకు వెళ్లి వస్తుండగా కుక్కలు దాడి చేశాయి. నాలుగు కుక్కలు వెనుక నుంచి ఒక్కసారిగా అరుస్తూ దూసుకొచ్చాయి. కుక్కల అరుపులకు పిల్లలంతా భయపడి పారిపోగా శ్యామలకు వినిపించకపోవడంతో అక్కడే ఉండిపోయింది. స్నేహితులు ఎందుకు పరుగుపెడుతున్నారో తెలుసుకునేలోగానే నాలుగు కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. కాళ్లు, చేతులు, పొట్టభాగంలో గాయాలయ్యాయి. ఇంతలో అటుగా వస్తున్న గ్రామస్తులు కుక్కలు తరిమి చిన్నారిని కాపాడారు. చిన్నారిని పొందూరు ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
Comments
Please login to add a commentAdd a comment