అధ్యక్ష పదవికి రేసులో 13 మంది
రాయగడ: జిల్లా బీజేపీ అధ్యక్ష పదవి ఎవరికి వరిస్తుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ పదవికి ఇప్పటికే 13 మంది రేసులో ఉన్నారు. రాష్ట్రంలో ఆ పార్టీ అధికార పగ్గాలు చేపట్టడంతో ఈసారి అధ్యక్ష పదవి కోసం పైరవీలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో స్థానిక సిరిగుడలోని ఆ పార్టీ కార్యాలయంలో ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్న దేవేంద్ర మహంతిని శనివారం పలువురు కలిసి తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ పదవికి రేసులో ఉన్నవారిలో కాళీరాం మాఝి, శివశంకర్ ఉలక, రామచంద్ర బెహర, ఎం.గోపి ఆనంద్, హలధర్ మిశ్రో, పద్మనాబ్ దాస్ (టుటు దాస్ ), వై.గణపతిరావు, మంజుల మినియాక, శ్యామసుందర్ దాస్, గుణనిధి బాగ్, హలధర్ హిమిరిక, వై.కొండబాబు, భాస్కరపండలు ఉన్నారు. అయితే ఈసారి అధిష్టానం 40 నుంచి 60 ఏళ్లలోపు వయస్సు వారికి మాత్రమే ఈ పదవిని కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తోందని సమాచారం. అదే జరిగితే సీనియర్ నేతలకు అవకాశం ఉండకపోవచ్చు. రానున్న పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో సత్తాచాటేందుకు సరైన నాయకుడిని ఎంపికి చేసేందుకు అధిష్టానం ఆలోచన చేస్తోంది.
ముగిసిన ఎన్‌సీసీ పరీక్షలు
రాయగడ: సీ సర్టిఫికేట్ కోర్సుల కోసం ఎన్‌సీసీ క్యాడెట్ల మధ్య నిర్వహించిన రాత పరీక్షలు ఆదివారంతో ప్రశాంతంగా ముగిశాయి. రాష్ట్రంలోని వివిధ కళాశాలలకు చెందిన ఎన్‌సీసీ క్యాడెట్లు పరీక్షకు హాజరయ్యారు. స్థానిక గొపబంధు మున్సిపాలిటీ ఉన్నత పాఠశాలలో ఆదివారం మహిళ బెటాలియన్–2 ఆధ్వర్యంలో జరిగిన పరీక్షలకు రాయగడ, కొరాపుట్, నవరంగపూర్, గజపతి జిల్లాల నుంచి 160 మంది క్యాడెట్లు హాజరయ్యారు.
ట్రాక్టర్–బైక్ ఢీకొని ఒకరు మృతి
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి పోలీసుస్టేషన్ పరిధిలో ఉండ్రుకొండ పంచాయతీ రహదారిలో ఆదివారం మధ్యాహ్నం ట్రాక్టర్ బైక్ ఎదురెదురుగా ఢీకొని సుక కామరామి (25) అనే వ్యక్తి మృతి చెందాడు. ఈయన పోడియ సమితి ఏరువన్‌పల్లి గ్రామ వాసి. తన భార్యతో కలిసి ఆదివారం ఉదయం అత్తవారింటికి వెళ్లారు. అక్కడ భార్యను వదిలి బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ట్రాక్టర్ ఢీకొనడంతో తలకు గాయమై చనిపోయారు. ట్రాక్టర్ డ్రైవర్ పరారైపోయాడు. స్థానికులు కలిమెల పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఐఐసీ చంద్రకాంత్ తండ తన సిబ్బందితో వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.
అధ్యక్ష పదవికి రేసులో 13 మంది
Comments
Please login to add a commentAdd a comment