సవర బాప్టిస్టు క్రిస్టియన్ మండలి సభ రద్దు
పర్లాకిమిడి: గజపతి జిల్లాలో అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్న సవర బాప్టిస్టు క్రిస్టియన్ మండలి సమ్మేళనం (సెరంగో) ప్లాటినాం జూబ్లీ వార్షిక వేడుకలు శనివారం ప్రారంభమయ్యాయి. సోమవారంతో ముగియాల్సి ఉండగా.. ఉన్నత స్థాయి పోలీసు అధికారుల ఆదేశాలతో ఆదివారం అర్ధాంతరంగా రద్దయ్యాయి. దీంతో గజపతి జిల్లా నుంచే కాక గుణుపురం, రాయగడ, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన మైనార్టీ క్రిస్టియన్లు నిరాశతో వెనుదిరిగి వెళ్లిపోయారు. ప్లాటినాం జూబ్లీ ఎస్.బి.సి.ఎం.ఎస్. (సవర బాప్టిస్టు క్రిస్టియన్ మండలి) బల్లబోడా గ్రామం దంతరిలాల చర్చి వద్ద సభ ఈనెల 15 నుంచి 17వ తేదీ వరకూ మూడు రోజుల పాటు జరగాల్సి ఉంది. అయితే గజపతి జిల్లాలో ఆర్‌ఎస్‌ఎస్, వీహెచ్‌పీ, భజరంగ్ దళ్ వాటి అనుబంధ సంస్థలు దీనికి వ్యతిరేకంగా ఫిబ్రవరి ఐదో తేదీన నిరసన ర్యాలీని జరిపి కలెక్టర్ బిజయ కుమార్ దాస్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ ర్యాలీలో అనేక మంది సాధుసంతువులు, హిందూ సురక్షా మంచ్ తరఫున నిరసన వ్యక్తం చేశారు. సమ్మేళనానికి వ్యతిరేకంగా హిందూ సురక్షా మంచ్ నిరసనల మధ్య బాస్టిస్టు మండలి అధినేతలకు జిల్లా యంత్రాంగం అనేక ఆంక్షలు విధించారు. మహా సమ్మేళనానికి ఫైర్ క్లియరెన్సు, వేదిక సురక్షితమైనదని ఆర్‌ఆండ్‌బీ అధికారుల వద్ద నుంచి ఎన్‌ఓసీ, గోహత్యకు పాల్పడటం లేదని సర్టిఫికెటు, పోలీసు బందోబస్తు తదితర సర్టిఫికెట్లు మంజూరు చేయాలని జిల్లా మేజిస్ట్రట్ ఒక లేఖ ద్వారా కోరారు. వీటిని ఎస్.బి.సి.ఎం.ఎస్ ప్రతినిధులు దాఖలు చేసి అనుమతి పొందారు. శనివారం ప్లాటినాం జుబ్లీ వేడుకలు ప్రారంభమైయ్యాయి. అయితే ఆదివారం బరంపురం డీజీ ఆదేశాల మేరకు 75వ ప్లాటినాం వేడుకలు రద్దు చేయాలని ఆదేశాలు రావడంతో అర్ధాంతరంగా ముగిశాయి.
Comments
Please login to add a commentAdd a comment