ఉచిత విద్యుత్ పథకానికి మంగళం
● ఒక్క ఉచిత విద్యుత్ కనెక్షన్ కూడా ఇవ్వని ప్రభుత్వం
● ఉచిత విద్యుత్‌కు తూట్లు పొడుస్తున్న కూటమి
ఏడు నెలలవుతోంది
ఏడు నెలల క్రితం వీరఘట్టం విద్యుత్ శాఖ కార్యాలయంలో ఉచిత విద్యుత్ మీటరు కోసం దరఖాస్తు చేశాను. ఇంత వరకు ఆ దరఖాస్తు ఏమైందో తెలియదు. ఉచిత విద్యుత్ కనెక్షన్ ఎప్పుడు ఇస్తారని లైన్‌మెన్‌ను అడిగితే ఎవరూ సమాధానం చెప్పడం లేదు. ఉచిత విద్యుత్ కనెక్షన్ ఎప్పుడు ఇస్తారో చెప్పాలి. – లెంక జగదీశ్వరరావు, రైతు,
నడుకూరు గ్రామం, వీరఘట్టం మండలం, పార్వతీపురం మన్యం జిల్లా
వీరఘట్టం:
● పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలం కడకెల్ల గ్రామానికి చెందిన ద్వారపురెడ్డి రామకృష్ణ అనే రైతు ఉచిత వ్యవసాయ విద్యుత్ మీటర్ కోసం 8 నెలల క్రితం దరఖాస్తు చేశాడు. ఇంతవరకు ఆయన దరఖాస్తును పరిశీలించిన దాఖలాలు లేవు.
● అలాగే వీరఘట్టం గ్రామానికి చెందిన మంచుపల్లి గోపాలం అనే మరో రైతు ఉచిత వ్యవసాయ విద్యుత్ మీటర్ కోసం తన దరఖాస్తును ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఆ రైతుకు కూడా ఇంతవరకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వలేదు. ఇలా వీరఘట్టం మండలంలో 15 మంది రైతులు ఉచిత వ్యవసాయ విద్యుత్ మీటరు కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోగా, మరో 30 మంది వీరఘట్టం ట్రాన్స్‌కో కార్యాలయంలో ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేశారు. ఇలా వీరఘట్టం మండలంలో ఇంతవరకు 45 మంది వరకు రైతులు ఉచిత విద్యుత్ వ్యవసాయ మీటర్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతవరకు ఒక్క ఉచిత విద్యుత్ వ్యవసాయ కనెక్షన్ కూడా ఇవ్వకపోవడం గమనార్హం.
● ఉచిత విద్యుత్ పథకానికి చంద్రబాబు ప్రభుత్వం దశల వారీగా మంగళం పాడుతోంది. రైతులకు ఆపన్న హస్తంగా మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఈ విప్లవాత్మక పథకానికి టీడీపీ కూటమి ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది.అందుకోసం పక్కా పన్నాగంతో వ్యవహరిస్తోంది. కొత్తగా వ్యవసాయ కనెక్షన్లు ఇస్తే ఉచిత విద్యుత్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఏకంగా కొత్త విద్యుత్ కనెక్షన్ల మంజూరునే ప్రభుత్వం నిలిపి వేసింది. గతేడాది 2024 ఆగస్టు తర్వాత రాష్ట్రంలో కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ ఒక్కటి కూడా కూడా మంజూరు చేయలేదు. ఆగస్టు నెలాఖరు వరకు మంజూరు చేసిన కనెక్షన్లు కూడా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఆమోదించిన వాటికే కనెక్షన్లు ఇచ్చారు.కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఎనిమిది నెలల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ మంజూరు చేయలేదు.
రాష్ట్రంలో 1.50 లక్షల దరఖాస్తుల పెండింగ్..
పార్వతీపురం జిల్లాలో కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసి నెలలు గడుస్తున్నప్పటీకీ వాటికి ప్రభుత్వం ఆమోదం తెలపడం లేదు. పార్వతీపురం మన్యం జిల్లాలోని 15 మండలాల్లో ఇప్పటికీ 2,500లకు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.వాటిని పరిష్కరించి కొత్త విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఏ మాత్రం లేదు. కనీసం ఆ దరఖాస్తులను ఇంతవరకు పరిశీలించకపోవడం కానీ, స్క్రూట్నీ చేయకపోవడం కానీ ఇందుకు నిదర్శనం. దీంతో జిల్లాలో ఇప్పటి వరకు 2,500మందికి పైగా రైతులు ఉచిత విద్యుత్ పథకాన్ని కోల్పోతున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లో రైతులకు కూటమి ప్రభుత్వం ఉచిత విద్యుత్ పథకం అందనీయకుండా తీరని అన్యాయం చేస్తోంది. రాష్ట్రంలో ఉచిత విద్యుత్ కోసం సుమారు 1.50 లక్షల మంది రైతుల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రాధాన్యతా క్రమంలో మంజూరు
ఉచిత వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు గతేడాది ఆగస్టు నెలాఖరు వరకు పూర్తి చేశా. మిగిలిన దరఖాస్తులకు ప్రాధాన్యతా క్రమంలో కనెక్షన్ ఇస్తాం. కనెక్షన్ కావాల్సిన వారు 1912 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే మా సిబ్బంది పరిశీలించి విద్యుత్ కనెక్షన్ ఇస్తారు.
– ఎస్.చలపతిరావు, ట్రాన్స్‌కో ఎస్‌ఈ,
పార్వతీపురం మన్యం జిల్లా
ఉచిత విద్యుత్ పథకానికి మంగళం
ఉచిత విద్యుత్ పథకానికి మంగళం
Comments
Please login to add a commentAdd a comment