జర్నలిస్టు సంఘాల నిరసన | - | Sakshi
Sakshi News home page

జర్నలిస్టు సంఘాల నిరసన

Published Tue, Feb 18 2025 1:04 AM | Last Updated on Tue, Feb 18 2025 1:02 AM

జర్నల

జర్నలిస్టు సంఘాల నిరసన

జర్నలిస్టుపై దాడిచేసిన టీడీపీ

నాయకుడిని అరెస్టు చేయాలని డిమాండ్‌

జాయింట్‌ కలెక్టర్‌ సేతు మాధవన్‌కు వినతి

విజయనగరం అర్బన్‌: పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం ప్రజాశక్తి విలేకరి మల్యాడ రామారావుపై దాడి చేసిన టీడీపీ మక్కువ మండల పార్టీ అధ్యక్షుడు గుల్ల వేణుగోపాల్‌ నాయుడిని అరెస్టు చేయాలని జర్నలిస్టుల సంఘాలు డిమాండ్‌ చేశాయి. జర్నలిస్టుపై చేసిన దాడికి నిరసనగా స్థానిక కలెక్టరేట్‌ వద్ద గల గాంఽధీ విగ్రహం దగ్గర సోమవారం నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ విఽధినిర్వహణలో భాగంగా అభివృద్ధి పనుల నిర్వహణలపై వార్త కవరేజ్‌ కోసం విలేకరిపై దాడి చేయడం, చంపుతానని బెదిరించడం దుర్మార్గమని ఖండించారు. ఎన్నికల కోడ్‌ నిబంధనలను పాటించని అధికారుల పనులపై, మంత్రి కార్యక్రమాలపై ఎందుకు రాశావని అసభ్యకరమైన పదజాలంతో దూషించి భౌతిక దాడికి పాల్పడడం దారుణమని వాపోయారు. ఇకపై వార్తలు రాస్తే చంపేస్తానని బెదిరించిన వేణుగోపాల్‌ నాయుడిని కఠినంగా శిక్షించాలని, కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని కోరారు. అనంతరం జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.సేతుమాధవన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి పీఎస్‌శివప్రసాద్‌, జిల్లా అధ్యక్షుడు అల్లు సూరిబాబు, ప్రధాన కార్యదర్శి ఎంఎస్‌ఎన్‌రాజు, ఏపీడబ్ల్యూజేఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు కె.రమేష్‌నాయుడు, జాప్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అవనాపు సత్యనారాయణ, తెలుగు జర్నలిస్టు ఫోరం అధ్యక్షుడు ఎంఎంఎల్‌నాయుడు, విజయనగరం వెల్ఫేర్‌ అసోసియేషన్‌ జిల్లా గౌరవాధ్యక్షుడు జి.కోటేశ్వరరావు, సాక్షి టీవీ బ్యూరో అల్లు యుగంధర్‌, ప్రజాశక్తి ప్రతినిఽధి సీహెచ్‌.రాము, వివిధ ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రతినిధులు డేవిడ్‌ రాజు, శ్రీను, రవి తదితరులు పాల్గొన్నారు.

పత్రికా స్వేచ్ఛకు విఘాతం

పార్వతీపురం: పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగించడం వల్ల ప్రజాస్వామ్య మనుగడకు ముప్పు వాటిల్లే ప్రమాదముందని, వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరించే విలేకరులపై దాడులు చేయడం సరికాదని ఏపీడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు అల్లువాడ కిశోర్‌ పేర్కొన్నారు. ఈ మేరకు మక్కువ మండల విలేకరిపై భౌతికదాడులకు పాల్పడడంతో పాటు చంపుతానని టీడీపీ మక్కువ మండల అధ్యక్షుడు గుల్ల వేణుగోపాల్‌నాయుడు హెచ్చరించిన చర్యను ఖండిస్తూ సోమవారం కలెక్టర్‌ కార్యాలయం వద్ద ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. దాడులకు నిరసనగా పలు నినాదాలు చేశారు. విలేకరిపై దాడి సంఘటన ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టులాంటిదని పేర్కొన్నారు. తక్షణమే దాడి చేసిన వారిని చట్ట ప్రకారం శిక్షించాలని, విలేకరికి రక్షణ కల్పించాలని కోరుతూ కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. దీనిపై విచారణ చేపట్టి అవసరమైన చర్యలు చేపడతామని కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజే సంఘ సభ్యులు జిల్లా కార్యదర్శి గండి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు కె.శ్రీనివాసరావుతోపాటు జిల్లాలోని వివిధ పత్రిలు, మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
జర్నలిస్టు సంఘాల నిరసన1
1/1

జర్నలిస్టు సంఘాల నిరసన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement