గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలి
విజయనగరం ఫోర్ట్: గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ జీవనరాణి తెలిపారు. ఈ మేరకు స్థానిక జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో 9 పీహెచ్‌సీల వైద్యాధికారులు సిబ్బందితో సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హైరిస్క్ గర్భిణులను త్వరితగతిన గుర్తించి వారు సుఖ ప్రసవం అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. బుధ, శనివారాల్లో నిర్వహించే వ్యాక్సినేషన్‌ను లబ్ధిదారులందరికీ వేసేలా చూడాలని చెప్పారు. టీబీ గురించి ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ఒళ్లంతా తిమ్మిర్లుగా అనిపించడం, కండరాలు బలహీనంగా మారడం, డయేరియా, పొత్తి కడుపు నొప్పి, జ్వరంతో పాటు వాంతులు గులియన్ బారే సిండ్రోమ్ లక్షణాలని తెలిపారు. ఈ వ్యాధి పిల్లలు, వృద్ధులపై తీవ్ర ప్రభావం చూపిస్తుందన్నారు. నాడీ వ్యవస్థను ఈవైరస్ దెబ్బతీస్తుందని తెలిపారు. దీంతో రోగి పక్షవాతం బారిన పడతారన్నారు. ఇది అంత ప్రమాదకరం కాదని, దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. డీఎల్‌ఓ డాక్టర్ కె. రాణి, డీఐఓ డాక్టర్ అచ్యుత కుమారి, ఎన్‌సీడీ పీఓ డాక్టర్ సుబ్రహ్మణ్యం, డెమో వి.చిన్నతల్లి, తదితరులు పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ డాక్టర్ జీవనరాణి
Comments
Please login to add a commentAdd a comment