సంతృప్తి చెందేలా వినతులకు పరిష్కారం
విజయనగరం అర్బన్: ఆర్థిక పరమైన అంశాలు, కోర్టుల నుంచి నిలిపివేయమని ఆదేశాలు వచ్చిన అంశాలు తప్ప మిగిలిన అన్ని రకాల వినతులకు పూర్తిస్థాయిలో పరిష్కారం చూపాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అధికారులను ఆదేశించారు. వచ్చిన వినతులకు పూర్తిస్థాయిలో కూలంకుషంగా చదివి, పిటిషనర్లతో మాట్లాడి, క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి, అర్జీదారుల సంతృప్తే ముఖ్యమని భావించి సరైన సమాధానం ఇవ్వాలని సూచించారు. ఈమేరకు కలెక్టరేట్ ఆడిటోరియంలో రెవెన్యూ అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యంగా పీజీఆర్‌ఎస్, రెవెన్యూ సదస్సులు, రీ సర్వే, సీఎంఓ, వీఐపీ గ్రీవెన్స్‌సెల్‌లో నాలుగు రకాల వినతులు అందుతున్నాయని చెప్పారు. వాటిపై నిర్వహించిన విశ్లేషణలో సరాసరిగా ఒక్కో కుటుంబం నుంచి రెండు వినతులు వస్తున్నట్లు తేలిందన్నారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన వినతులను వెంటనే పరిష్కరించాలని, ఏ ఒక్క వినతైనా గడువు దాటితే సంబంధిత అధికారికి చార్జ్ మోమో జారీ చేయనున్నట్లు హెచ్చరించారు. నియోజకవర్గం వారీగా అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి, బుధవారం లోగా నివేదికలు ఇవ్వాలని ఆర్‌డీఓలను ఆదేశించారు. ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందస్తు ఏర్పాట్లు, ఎన్నికల తర్వాత నిర్వహించాల్సిన ప్రక్రియపై ఏర్పాట్లు చేసి సిద్ధంగా ఉండాలని తహసీల్దార్లకు సూచించారు. జేసీ సేతు మాధవన్ మాట్లాడుతూ, వచ్చిన వినతులకు సరైన పరిష్కారం చూపిస్తే, రీఓపెన్ కేసుల సంఖ్య తగ్గుతుందన్నారు. జిల్లాలో ప్రస్తుతం 94 శాతం సమస్యల పరిష్కారం జరుగుతోందని, ప్రతిరోజూ సమీక్షించడం వల్ల పెండింగ్ తగ్గిందన్నారు. రీఓపెన్ కేసులపై మండలాల వారీగా సమీక్షించి, కారణాలను తెలుసుకున్నారు. సమావేశంలో డీఆర్వో ఎస్.శ్రీనివాసమూర్తి, ఆర్‌డీఓలు, డిప్యుటీ కలెక్టర్లు, తహసీల్దార్లు, డీటీలు, సర్వేయర్లు పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్
Comments
Please login to add a commentAdd a comment