ఆప్కాస్ రద్దు నిర్ణయం ఉపసంహరించుకోవాలి
విజయనగరం గంటస్తంభం: ఆప్కాస్ రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కె.సుబ్బరావమ్మ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం సీఐటీయూ నగర కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఎల్‌బీజీ భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఆప్కాస్ రద్దు చేస్తూ క్యాబినెట్ చేసిన నిర్ణయం వల్ల రాష్ట్రంలో లక్షలాదిమంది అవుట్‌సోర్సింగ్ కార్మికుల పరిస్థితి పెనంలోనుంచి పొయ్యి మీద పడినట్లు అయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది మంచి ప్రభుత్వం అయితే మొత్తం కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని కోరారు. అంతేగానీ మళ్లీ థర్డ్ పార్టీ విధానంలో కార్మికుల్ని బందీలను చేసి వారి శ్రమను కొల్లగొట్టాలని చూస్తే పోరాటం తప్పదని హెచ్చరించారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల ప్రాణాలకు అండగా నిలుస్తున్న మున్సిపల్ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం చాలా దుర్మార్గమైన వైఖరి తీసుకుంటోందని, రిటైర్ అయిన వారిని నిర్దాక్షిణ్యంగా ఇంటికి పంపించి వారి కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారని మండిపడ్డారు. చివరికి వాటర్ సప్లై, నైట్ శానిటేషన్, స్ట్రీట్‌లైట్, తదితర విభాగాల్లో పనిచేస్తున్న థర్డ్ పార్టీ కార్మికులకు సకాలంలో జీతాలు చెల్లించకుండా పీఎఫ్ ఈఎస్‌ఐ కట్టకుండా, నచ్చినట్లు విధుల నుంచి తొలగించి ఇబ్బందులు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అతి కీలకమైన విశాఖ స్టీల్ ప్లాంట్‌కు నిధుల కుదింపు, పోలవరం అమరావతి సహా రైల్వే జోన్ తదితర ప్రాధాన్యతా అంశాలకు కేంద్రం నిధులు కేటాయించకపోయినప్పటికీ కూటమి పెద్దలు మౌనంగా ఉండడాన్ని ప్రజలంతా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఈ సమస్యలపై కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధం కావాలని కోరారు. సమావేశంలో సీఐటీయూ నగర అధ్యక్ష, కార్యదర్శులు ఎ.జగన్మోహన్‌రావు, బి.రమణ, నాయకులు పాపారావు, భాస్కరరావు, గురుమూర్తి, రాఘవ, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కె.సుబ్బరావమ్మ
Comments
Please login to add a commentAdd a comment