మూలకు చేరిన నిఘా నేత్రం!
● శ్రీకూర్మం క్షేత్రంలో పనిచేయని సీసీ కెమెరాలు
● పట్టించుకోని పాలకులు
గార : విష్ణువు అవతారాల్లో రెండో అవతారం, ప్రపంచంలో ఇంకెక్కడా నిర్మించకూడదని పురాణాలు పేర్కొన్న ప్రముఖ క్షేత్రం శ్రీకూర్మం. ఇంతటి మహిమాన్వితమైన ఆలయం వద్ద నిఘా మసకబారుతోంది. గతంలో మూలవిరాట్ స్కాన్, తిరునామం పగలగొట్టడం వంటి ఘటనలు నేపథ్యంలో 2012లో హిందుత్వ సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేయగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత పలువురు అధికారులు మారినప్పుడు సీసీ కెమెరా వ్యవస్థను పటిష్టం చేశారు. తర్వాత నిర్వహణ కొరవడంతో సీసీ కెమెరా వ్యవస్థ పనిచేయడం లేదు. ఆలయ కార్యనిర్వహణాధికారి కార్యాలయంలో సీసీ ఫుటేజీని పరిశీలించే మానిటర్ వ్యవస్థ పాడైపోయింది. గర్భగుడి లోపలికి, ఆలయానికి వచ్చే భక్తుల రాకపోకలు గమనించేందుకు సీసీలు ఏర్పాటు చేసినప్పటికీ మానిటర్ కొద్దిరోజుల కిందట కాలిపోయింది. ఇప్పటీకీ మరమ్మతులు చేయలేదు. వీటన్నింటినీ పర్యవేక్షించాల్సిన ఈవోకు రావివలస, పలాస గ్రూపు ఆఫ్ టెంపుల్స్‌తో పాటు శ్రీకూర్మనాథాలయం బాధ్యతల ఉన్నాయి. ఇక్కడ ఈవోతో మొదలుకొని అందరూ ఇన్‌చార్జిలే. రాత్రిపూట పవళింపు సేవ తర్వాత ఆలయ ప్రాంగణంలో ఎవరూ ఉండకూడదన్న నిబంధన ఉన్నా అమలు కావడం లేదు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు దృష్టిసారించాలని గ్రామస్తులు, భక్తులు కోరుతున్నారు. ఈ విషయమై ఆలయ ఇన్‌చార్జి ఈవో జి.గురునాథరావు వద్ద ప్రస్తావించగా సీసీ టీవీ మానిటర్ కాలిపోవడం వాస్తవమేనని, ఉన్నతాధికారులకు తెలియజేశామని చెప్పారు. తన మొబైల్‌లో లింక్ ద్వారా సీసీ ఫుటేజ్ చూస్తున్నానని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment