వన్య ప్రాణులను కాపాడారు
జయపురం: వన్య ప్రాణుల రక్షణకు దృష్టి సారించింది బొయిపరిగుడ అటవీ సిబ్బంది. అడవుల్లో వన్య ప్రాణులను వేటాడే ఆట కట్టించేందుకు అటవీ సిబ్బంది పెట్రోలింగ్ జరిపింది. మంగళవారం రాత్రి బొయిపరిగుడ సమితి టికరపడలో కొంతమంది మూడు అడవి పందులను పట్టుకొని గ్రామానికి తీసుకువెళ్లారని, వాటిని బుధవారం చంపి మాంసం అమ్మేందుకు యోచిస్తున్నారని విశ్వాసనీయ వర్గాల ద్వారా బొయిపరిగుడ సమితి దసంతపూర్ అటవీ అధికారి రంజితా నాయక్‌కు సమాచారం అందింది. రంజితా నాయక్ ఆధ్వర్యంలో ఓ బృందం టికరపడ గ్రామానికి వెళ్లింది. గ్రామంలో ఒకచోట మూడు అడవి పందులు బంధించి ఉంచడాన్ని గుర్తించారు. వాటిని రక్షించి బొయిపరిగుడ అటవీ విభాగ కార్యాలయానికి తీసుకువచ్చారు. అడవి పందులను బుధవారం వైద్య పరీక్షలు చేపట్టిన అనంతరం అడవిలో విడిచి పెట్టనున్నట్లు రంజితా నాయక్ వెల్లడించారు. మూడు అడవి పందులను పట్టి ఉంచిన వారిని కనుగొని తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment