
ప్రకృతి సురక్ష పాదయాత్ర
జయపురం: ప్రకృతి పరిరక్షణపై ప్రజలకు అవగాహన కలిగించే ప్రధాన లక్ష్యంతో ప్రకృతి సురక్ష యాత్ర ప్రారంభించారు కొంతమంది గాంధేయ వాదులు. ప్రకృతి సురక్షా పాదయాత్ర అవిభక్త కొరాపుట్ మల్కన్‌గిరిలో గత నెల 28న ప్రారంభమైంది. చిత్తరంజన్ షొడంగి నేతృత్వంలో మల్కన్‌గిరి నుంచి ప్రారంభమైన యాత్ర శనివారం సాయంత్రం జయపురం చేరింది. ఈ పాద యాత్రలో రాయగడ జిల్లా బలరాం పండ, విశ్రాంత ఉపాద్యాయులు రవీంధ్ర నాథ్ అటోయి, ఒడిశా ఆరోగ్య సేవా సమితి ఉపాధ్యక్షుడు స్మృతి శేఖర సాహు, మహారాష్ట్ర నుంచి వచ్చిన నెహాల్ గాంధీ, జగదీష్ చండాల్, సందీప్ చాటే, సూర్య ప్రధాన్, పూరీ నీలకంఠ బేద్య, సంఘ సామాజిక కార్యకర్తలు కొరాపుట్, రాయగడ, మల్కనగిరి జిల్లాల నుంచి పలువురు పాల్గొన్నారు. ప్రతి దినం 15 కిలోమీటర్ల దూరం పాదయాత్ర జరుపుతూ 44 దినాలలో 670 కిటోమీటర్లు పాదయాత్ర నిర్వహించుకుంటూ ఏప్రిల్ 12న పూరీ చేరుకుంటామన్నారు. మహాత్మా గాంధీ ఆంగ్లేయ పాలకులకు వ్యతిరేకంగా ఉప్పు సత్యాగ్రహం ప్రారంభించి 1930 ఏప్రిల్ 12 వ తేదీన గుజరాత్ దండీలో పూర్తి చేశారని గుర్తు చేశారు. ఈ యాత్రలో రాయగడ, మల్కన్‌గిరి సరిహద్దు రాష్ట్రాల నుంచి 25 మందికి పైగా పురుషులు, మహిళలు పాల్గొన్నారు. వీరు పూరీలో జరిగే మూడు దినాల జాతీయ స్థాయి సమ్మేళనంలో పాల్గొంటారు.

ప్రకృతి సురక్ష పాదయాత్ర
Comments
Please login to add a commentAdd a comment