
విద్యార్థిపై దాడి
● దర్యాప్తు చేపట్టిన అధికారులు
రాయగడ: జిల్లాలోని గుణుపూర్ తహసీల్దార్ కార్యాలయం సమీపంలో గల వంద పడకల సామర్థ్యం గల అన్వేష హాస్టల్‌లో చదువుతున్న విద్యార్థిపై తోటి విద్యార్థులు దాడి చేసిన ఘటనకు సంబంధించి వీడియో వైరలైంది. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న వీడియోను చూసిన సంబంధిత శాఖ అధికారులు ఈ మేరకు దర్యాప్తు చేపట్టారు. హాస్టల్‌లో చదువుతున్న విద్యార్థుల సంరక్షణకు సంబంధించి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది నెలల క్రితం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో గల సంక్షేమ శాఖ పరిధిలో గల హాస్టళ్లల్లో చదువుతున్న కొంత మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడటం సంచలనం సృష్టించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి.. హాస్టళ్ల పనితీరు, తదితర అంశాలకు సంబంధించి వాస్తవాలను తెలియజేసేందుకు దర్యాప్తునకు కూడా ఆదేశించింది. తాజాగా జిల్లాలోని గుణుపూర్‌లో గల రాష్ట్ర సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్వేష హాస్టల్‌లో చదువుతున్న విద్యార్థిపై తోటి విద్యార్థులు దాడి చేసిన సంఘటన తీవ్ర కలకలం రేపింది. ఒకటి నుంచి పదొ తరగతి వరకు చదుతున్న విద్యార్థుఽలు ఈ హాస్టల్‌లో ఉంటున్నారు. విద్యార్థిని తోటి విద్యార్థులు దాడి చేసి గాయపరిచారు. విద్యార్థి ఎంత మొరపెట్టుకున్నా ఒకరి తరువాత మరోకరు గాయపరుస్తూనే ఉన్నారు. కేకలు పెట్టినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. అనంతరం నిర్వాహకులు గాయాలకు గురైన విద్యార్థిని గుణుపూర్ ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. గుట్టుచప్పుడు లేకుండా విద్యార్థిని చికిత్స చేయించిన అనంతరం తిరిగి హాస్టల్‌కు తరలించారు. శనివారం రాత్రి ఈ విషయమై వీడియో వైరల్ అవ్వడంతో అధికారులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment