జైలుకెళ్లినా తీరు మారలేదు
కె.కోటపాడు (అనకాపల్లి జిల్లా): జైలుకెళ్లినా వారి తీరు మారలేదు. ఒకరు గంజాయి కేసులోనూ, మరొకరు దొంగతనం కేసులోనూ శిక్ష అనుభవించి ఈ నెలలోనే జైలు నుంచి విడుదలయ్యారు. మరలా పాత పంథాలోనే నేరాల బాట పట్టడంతో కటకటాల వెనక్కి వెళ్లారు. మండలంలో బత్తివానిపాలెం కూడలి వద్ద సోమవారం 12 కిలోల గంజాయిని తరలిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు పట్టుకున్నారు. వీరిద్దరి నుంచి రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఐ ఆర్.ధనుంజయ్ వివరాల ప్రకారం... ఇక్కడ వాహనాలను తనిఖీ చేస్తుండగా, బ్యాగులతో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు యువకులను తనిఖీ చేశారు. వీరి వద్ద బ్యాగుల్లో 12 కిలోల గంజాయిని గుర్తించి అదుపులోనికి తీసుకున్నారు. వీరిది ఢిల్లీకి చెందిన శిబరాం ప్రధాన్, ఒడిశాకు చెందిన నందన్‌రాంగా గుర్తించారు. ఈ గంజాయిని ఒడిశాలోని జోలాపుట్ నుంచి బత్తివానిపాలెం కూడలి మీదుగా పెందుర్తి రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్లే క్రమంలో పట్టుబడ్డారు. బరంపురం జైల్లో శిబరాం ప్రధాన్ గంజాయి కేసులోను, నందన్‌రాం దొంగతనం కేసులో శిక్ష అనుభవించి ఈ నెలలోనే విడుదలయ్యారు. అక్కడ జైల్లో ఏర్పడిన పరిచయంతో వీరిద్దరూ మరలా గంజాయి రవాణాకు పాల్పడుతూ పట్టుబడ్డారు. వీరిద్దరిపైన కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు. గంజాయి విలువ రూ.60 వేలు ఉంటుందన్నారు.
12 కిలోల గంజాయి తరలిస్తూ పట్టుబడ్డ ఇద్దరు నిందితులు