విజయనగరం క్రైమ్: జిల్లాలో డ్రోన్స్ సహాయంతో పేకాట, కోడి పందాలకు పోలీసులు చెక్ పెడుతున్నారు. విజయనగరంలోని హుకుంపేట శివారు, పూసపాటిరేగ మండలం వెంపడాం వద్ద మంగళవారం పోలీసులు డ్రోన్స్ ఉపయోగించి పేకాట ఆడుతున్న, కోడి పందాలు నిర్వహిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు వచ్చిన కచ్చితమైన సమాచారంతో విజయనగరం టూటౌన్ సీఐ టి.శ్రీనివాసరావు సిబ్బంది హుకుంపేట శివారులో పార్కింగ్ చేసిన లారీలో పేకాట ఆడుతున్న వారిపైకి డ్రోన్‌ను వంపి, శివారు ప్రాంతంలో కొంతమంది వ్యక్తులు పేకాట ఆడుతున్నట్లు నిర్ధారించుకుని, రైడ్ చేసి పారిపోతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.12,600 నగదు, ఆరు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
కోడి పందాల శిబిరంపై దాడి
అలాగే జిల్లా కేంద్రానికి దగ్గరలో ఉన్న పూసపాటిరేగ మండలం వెంపడాం గ్రామ శివారులో కోడి పందాలు నిర్వహిస్తున్నట్లు ఎస్బీ పోలీసులకు వచ్చిన సమాచారంతో వారిపైకి డ్రోన్ పంపి, సుదూర ప్రాంతంలో కోడి పందాలు నిర్వహిస్తున్నట్లు నిర్ధారించుకుని భోగాపురం రూరల్ సీఐ జి.రామకృష్ణ, పూసపాటిరేగ ఎస్సై దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో పోలీస్‌సిబ్బంది రైడ్ చేసి, కోడి పందాలు ఆడుతూ, పారిపోతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.15,600 నగదు, రెండు కోడి పుంజులను స్వాధీనం చేసుకున్నట్లు ఈ సందర్బంగా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. నేర నియంత్రణలోను, శివారు ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు డ్రోన్స్‌ను వినియోగిస్తున్నామని, పట్టణ, గ్రామ శివారు ప్రాంతాలపై డ్రోన్స్ సహాయంతో నిఘా పెడుతున్నామని ఎస్పీ ఈ సందర్భంగా చెప్పారు.