పోలీసుల పల్లెనిద్ర
● గ్రామస్తులతో మీతోనే మేము అంటున్న సీఐలు, ఎస్సైలు
విజయనగరం క్రైమ్: ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశాలతో జిల్లాలోని పోలీస్ అధికారులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పల్లెల్లో నిద్ర చేసి మీతోనే మేము అని పల్లె వాసులకు భరోసా కల్పించారు. ఈ విధంగా గ్రామస్తులతో మమేకమవుతూ వారి సమస్యలను విని, క్షేత్రస్థాయిలో పరిష్కరిస్తున్నారు. తద్వారా పల్లెల్లో స్థానికులతో మమేకమవడమే కాకుండా ఆయా గ్రామాలలో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ఉండేందుకు పల్లెనిద్రతో ఓ కన్నేశారు. అలాగే గ్రామంలోకి వెళ్లి రాత్రి పడుకునే ముందు ఒకసారి గ్రామస్తులతో సమావేశమై సైబర్ నేరాలు, మహిళల భద్రత, శక్తి యావ్, రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. దీనిపై ఎస్పీ వకుల్ జిందల్ గురువారం మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను, శాంతిభద్రతల సమస్యలను గుర్తిస్తూ, వాటి పరిష్కారానికి సత్వరం చర్యలు చేపట్టేందుకు సంబంధిత పోలీసు అధికారులు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. అడాప్షన్ కానిస్టేబుల్స్ వారి పరిధిలోని గ్రామాల్లో నెలలో రెండు సార్లు పల్లెనిద్ర చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా పార్టీలకు అతీతంగా గ్రామస్తులతో మమేకం కావాలని, గ్రామసమస్యలు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే సమస్యల గురించి వారితో చర్చించి, గ్రామాల్లో ఎటువంటి వివాదాలు, అల్లర్లు జరగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని చెప్పారు.
రెండునెల్లో 72 గ్రామాల్లో పల్లెనిద్ర
గ్రామాల్లోకి వచ్చే కొత్త వ్యక్తులు, హిస్టరీ షీట్లు కలిగిన వ్యక్తుల నడవడికపై నిఘా పెట్టాలని, వారు జీవనం ఏవిధంగా సాగిస్తున్నది తెలుసుకోవాలని సిబ్బందికి ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. గడిచిన రెండు నెలల్లో జిల్లాలో 10మంది సీఐలు, 30మంది ఎస్సైలు 72 గ్రామాల్లో పల్లెనిద్ర చేసి, గ్రామస్తులతో మమేకం కావడం వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని, ప్రజల్లో పోలీసుశాఖ పట్ల నమ్మకం, విశ్వాసం పెరుగుతున్నాయని ఎస్పీ వకుల్ జిందల్ సంతృప్తి వ్యక్తం చేశారు.