21
యూడీఐడీ..
సేవలు రెడీ
● దివ్యాంగులకు ఆధార్ తరహాలో ప్రత్యేక నంబర్ ● కొత్తపోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన కేంద్రం ● ఇంటి నుంచే ఆన్‌లైన్ ద్వారా సులువుగా సేవలు పొందే అవకాశం ● ప్రయాస లేకుండా రైల్వేపాస్ పొందే సదుపాయం
●దివ్వాంగులకు వరం..
దివ్యాంగులకు ఆధార్ కార్డు తరహాలో కేంద్ర ప్రభుత్వం యూడీఐడీని ప్రవేశపెట్టింది. పోర్టల్‌లో దరఖాస్తు చేసుకొని ఐడీ నంబర్ పొందవచ్చు. ప్రత్యేక కార్డు కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రానున్న రోజుల్లో ప్రభుత్వం నుంచి ఎలాంటి సంక్షేమ పథకాలు అందాలన్నా ఈ కార్డు తప్పనిసరి కానుంది.
– కె.కవిత, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏడీ, శ్రీకాకుళం
నరసన్నపేట:
దివ్యాంగులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలు, ఇతర ప్రయోజనాలు, సదరం శిబిరాల సమాచారం తదితర సేవలను సులభంగా పొందేందుకు యూనిక్ డిజేబిలిటీ ఐడెంటిటీ కార్డు(యూడీఐడీ) అందుబాటులోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పోర్టల్ దివ్యాంగులకు వరంలా మారనుంది. ఈ పోర్టల్ ద్వారా పొందిన ఐడీ నంబర్ ఆధారంగా దివ్యాంగులు రైల్వేపాస్‌లను కూడా పొందవచ్చు. గతంలో సదరం సర్టిఫికెట్లు పొందాలంటే స్లాట్ బుకింగ్ కోసం మీ–సేవ కేంద్రాలు, ఆన్‌లైన్ సెంటర్ల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇకపై యూడీఐడీ నంబర్ ద్వారా దివ్యాంగులు ఇంటి వద్ద నుంచే శ్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు.
యూడీఐడీ పొందాలంటే..
హెచ్‌టీటీపీ://ఎస్‌డబ్ల్యూఏవీఎల్‌ఏఎంబీఏఎన్‌సీఏఆర్‌డీ.జీఓవి.ఇన్ అనే వెబ్‌సైట్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ద్వారా దివ్యాంగులు నేరుగా ఫోన్, ఇంటర్‌నెట్ సెంటర్, మీ–సేవా కేంద్రాల నుంచే కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
సులభతరంగా సేవలు..
●కొత్తగా అందుబాటులోని తీసుకువచ్చిన యూడీఐడీ పోర్టల్ ద్వారా సేవలు సులభతరం కానున్నా యి. సదరం శిబిరాల కోసం మీ సేవతో పాటు యూడీఐడీ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లోనూ దరఖాస్తు చేసుకోవచ్చు. వైద్యపరీక్షలకు ఎప్పుడు హాజరు కావాలనే సమాచారం దివ్యాంగుల ఫోన్ నంబర్‌కు సంక్షిప్త సమాచారం రూపంలో వస్తుంది. అయితే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసే సమయంలో తప్పులు, అక్షరదోషాలు లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది.
●ఇప్పటి వరకూ ఐదు రకాల సేవల వైకల్యం ఉన్న వారికే ఈ–సేవ ద్వారా సదరం శిబిరాలకు దరఖా స్తు చేసుకొనే అవకాశం ఉండేది. ఇక యూడీఐడీ పోర్టల్‌లో 21 రకాల సేవల వైకల్యాలను చేర్చారు. తలసేమియా, ఆటిజం, యాసిడ్ బాధితులు, న్యూరో సంబంధిత బాధితులు కూడా సదరం శిబిరాల కోసం యూడీఐడీ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
●శిబిరంలో వైకల్య నిర్థారణ పూర్తయ్యాక స్మార్ట్‌కార్డును పోస్టల్ శాఖ ద్వారా ఇంటికే పంపిస్తారు. ఈ కార్డు పింఛన్‌తో పాటు రైల్వేపాస్‌లు, ఇతర సంక్షేమ పథకాలకు దేశ వ్యాప్తంగా చెల్లుబాటు కానుంది.
●యూడీఐడీ కార్డులను ఆన్‌లైన్ నుంచే డౌన్‌లోడ్ చేసుకొనే అవకాశం కేంద్రం కల్పించింది. ఇప్పటి వరకూ సదరం సర్టిఫికెట్ మన రాష్ట్రంలో మాత్రమే చెల్లుబాటు అయ్యేవి.
దరఖాస్తు ఇలా..
ఆన్‌లైన్‌లో స్వాలంబన్‌కార్డు.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్‌ను సందర్శించాలి. అప్లయ్ బటన్‌పై క్లిక్ చేసి దరఖాస్తు ప్రక్రియ సంబంధించి కొన్ని సూచనలు ఉంటాయి. వాటిని పూర్తిగా చదివి అంగీకరిస్తూ సబ్‌మిట్ క్లిక్ చేస్తే దరఖాస్తు ఫారం ఓపెన్ అవుతుంది. అడిగిన సమాచారం నమోదు చేస్తే దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది. వైద్య పరీక్షలు అనంతరం వెబ్‌సైట్‌లో అర్జీల స్టేటస్‌ను నిత్యం పరిశీలించుకోవచ్చు.
21
21