దగ్ధమైన పెళ్లి పందిరి
నరసరావుపేట టౌన్: వివాహ వేడుక కోసం తెచ్చిన బాణ సంచా పేలి ఆటోతో పాటు రెండు వాహనాలు, పెళ్లి పందిరి దగ్ధమైన సంఘటన నరసరావుపేటలో జరిగింది. స్థానికులు అప్రమత్తమై మంటలను ఆర్పివేయ డంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. అరండల్ పేటలో ఆదివారం చోటుచేసుకున్న ఈ సంఘటన పట్టణంలో కలకలం రేపింది. వివరాల్లోకెళితే.. అరండల్ పేట అన్నపూర్ణమ్మ హాస్పటల్ వీధిలో వివాహ ఊరేగింపుగా వెళ్లేందుకు ఆటోలో బాణ సంచాను పెద్దసంఖ్యలో ఏర్పాటు చేశారు.
ఊరేగింపు మొదలవ్వగానే నిర్వాహకులు టపాసులు పేల్చారు. అందులోనుంచి చెలరేగిన నిప్పురవ్వలు ఆటోలో ఉన్న బాణ సంచాపై పడటంతో మంటలు చెలరేగాయి. ఒకేసారి బాణ సంచా అంతా పేలటంతో పెద్దస్థాయిలో శబ్ధం వచ్చింది. దీంతో స్థానికులు భయంతో పరుగు తీశారు. కొద్దిసేపటి తర్వాత అప్రమత్తమైన స్థానికులు మంటలను అదుపు చేశారు. ఆటో నుంచి వచ్చిన మంటలు పక్కనే ఉన్న పెళ్లి పందిరికి అంటుకోవటంతో పందిరి పూర్తిగా దగ్ధమైంది.
అదేవిధంగా సమీపంలోని స్కూటీ, తోపుడు బండి అగ్నికి ఆహుతయ్యాయి. విద్యుత్ తీగలకు మంటలు వ్యాపించటంతో షార్ట్ సర్క్యూట్ సంభవించింది. సమాచారం అందుకున్న వన్‌టౌన్ సీఐ కృష్ణారెడ్డి, అగ్నిమాపక శాఖ, విద్యుత్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని, ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరాను నిలిపివేసి, పరిస్థితిని సమీక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment