యూత్ పార్లమెంట్ పోటీలకు ఆహ్వానం
గుంటూరు ఎడ్యుకేషన్: యూత్ పార్లమెంట్ పోటీలను సద్వినియోగం చేసుకోవాలని నెహ్రూ యువ కేంద్ర జిల్లా యూత్ అధికారి కిరణ్మయి దేవిరెడ్డి పేర్కొన్నారు. పట్టాభిపురంలోని టీజేపీఎస్ కళాశాలలో మంగళవారం యూత్ పార్లమెంట్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ గుంటూరు, బాపట్ల, పల్నాడు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల నుంచి 18 ఏళ్లు నుంచి 25 ఏళ్ల లోపు వయస్సు కలిగిన వారు యూత్ పార్లమెంట్ పోటీలలో పాల్గొనవచ్చని సూచించారు. తొలుత ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మై భారత్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని, ఒక్క నిమిషం నిడివి కలిగిన ‘వాట్ డస్ వికసిత్ భారత్ మీన్ టూ యూ అనే అంశం పైన వీడియో చేసి ఈనెల 9వ తేదీ అర్ధరాత్రి 11–59లోగా మై భారత్ పోర్టల్‌లో అప్లోడ్ చేయాలని సూచించారు. ఈ విధంగా నమోదు చేసుకున్న వారిని స్క్రీనింగ్ చేసి జిల్లా స్థాయిలో ఎంపిక చేస్తారని వివరించారు. ఆయా జిల్లాల నుంచి ఎంపికై న వారికి జిల్లా స్థాయిలో టీజేపీఎస్ కళాశాలలో 150 మంది విద్యార్థులకు పోటీ ఉంటుందని పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో ‘వన్ నేషన్, వన్ ఎలక్షన్ :పేవింగ్ ది వే ఫర్ వికసిత్ భారత్ అనే అంశంపై 3 నిముషాలు మాట్లాడాలని తెలిపారు. వర్శిటీ ప్రొఫెసర్లు, అధ్యాపకులు, ఆయా జిల్లాల ఎన్‌ఎస్‌ఎస్ అధికారులు, యూత్ నాయకులు, నెహ్రూ యువ కేంద్ర అధికారులు, ఇతర అధ్యాపకులు, సామాజిక కార్యకర్తలు పోటీల గురించి యువతకు అవగాహన కల్పించి, ఎక్కువ సంఖ్యలో పాల్గొనేలా చూడాలని చెప్పారు. వివరాలకు డాక్టర్ జేవీ సుధీర్ కుమార్ (9849854221), కిరణ్మయి దేవిరెడ్డి (9177753393)ని సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ కేవీ బ్రహ్మం, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.అనితాదేవి డాక్టర్ బీవీహెచ్ కామేశ్వర శాస్త్రి, సీహెచ్ రాంబాబు, ఆర్.జయశైలజ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment