తిరునాళ్లకు వెళ్లి వస్తూ తిరిగిరాని లోకాలకు..
రెంటచింతల: పాలువాయి గేటు గ్రామంలో సోమవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గోలి గ్రామానికి చెందిన మాచవరపు నాగేశ్వరరావు(45), బాలగాని ఆంజనేయులు ఇద్దరూ కలిసి ద్విచక్ర వాహనంపై దుర్గి మండలంలోని ముటుకూరు తిరునాళ్లకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి 167 ఏడీ నిర్మాణంలో భాగంగా పాలువాయి గేటు గ్రామంలోని రైల్వే ట్రాక్ వద్ద చేపట్టిన హైలేవల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాకపోవంతో రాత్రి సమయం కావడం వల్ల ముందు ఏమీ కనిపించకపోవడంతో ఒక్కసారిగా ద్విచక్రవాహనంతో బ్రిడ్జిపై నుంచి ఇద్దరూ కింద పడిపోయారు. దీంతో తీవ్రంగా గాయపడిన వారిద్దరినీ తొలుత నర్సరావుపేటలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారిలో మాచవరపు నాగేశ్వరరావు ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందాడు. బాలగాని ఆంజనేయులును మెరుగైన వైద్యం కోసం గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. బ్రిడ్జి నిర్మాణంలో ఉన్నట్లు ఆ ప్రాంతంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు బాధితుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నాగేశ్వరరావుకు భార్య ఏసమ్మ, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సీహెచ్ నాగార్జున తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి మరొకరికి తీవ్ర గాయాలు
Comments
Please login to add a commentAdd a comment