ఎలుకల సామూహిక నివారణకు చర్యలు
నకరికల్లు: ఎలుకల సామూహిక నివారణ చేపడితే వరి పంటను కాపాడుకోవడంలో ఆశించిన ఫలితాలు వస్తాయని జిల్లా వ్యవసాయాధికారి ఐ.మురళి సూచించారు. మండలంలోని దేచవరం గ్రామంలో మంగళవారం పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఎలుకల సామూహిక నివారణ కార్యక్రమాన్ని పల్నాడు జిల్లాలో తొలిసారిగా దేచవరంలో ప్రారంభించారు. బ్రోమోడయోలిన్ మందును విషపు ఎరగా తయారు చేసే విధానాన్ని రైతులకు వివరించి, ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జిల్లాలోని 28 వేల హెక్టార్ల విస్తీర్ణంలో వరి పంటలో ఈ నివారణ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. వరి పంట పిలక దశ నుంచి చిరుపొట్ట దశలో వరకు పంటను ఎలుకలు అధికంగా నాశనం చేస్తాయని అన్నారు. ఎలుకల దాడితో ఎకరాకు 10 నుంచి 30 శాతం పంట నష్టపోవాల్సి వస్తుందని తెలిపారు. పల్నాడు జిల్లా వనరుల కేంద్రం డీడీఏ ఎం.శివకుమారి మాట్లాడుతూ.. ఒక కేజీ విషపు ఎర తయారీకి నూకలు 96 శాతం, నూనె 2 శాతం, రసాయనిక మందు 2 శాతం కలిపి వాడాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఏరువాక కేంద్రం సమన్వయకర్త ఎం.నగేష్, పిడుగురాళ్ల డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు బి.శ్రీకృష్ణదేవరాయలు, మండల వ్యవసాయాధికారి కె.దేవదాసు, ఎంపీఈఓలు కె.రవిబాబు, కె.హనుమంతరావు, వీఏఏ షేక్.సుభాని, ఏఈఓ కె.దిలీప్‌కుమార్, రైతులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment