వారబందిపై రైతులకు అవగాహన కల్పించండి
నరసరావుపేట: నాగార్జునసాగర్ ప్రాజెక్టు నీటిని జిల్లాలో పంటల సాగు వినియోగానికి అవలంబిస్తున్న వారబందీ విధానంపై రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఎస్పీ కంచి శ్రీనివాసరావుతో కలసి రబీ సాగు, వేసవి తాగునీటి సరఫరాకు నాగార్జున సాగర్ ప్రాజెక్టు నీటి వినియోగంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టు నీటిలో మన రాష్ట్ర వాటాను వృథా చేయకుండా కాలువలపై ఆధారపడి సాగు చేస్తున్న ప్రతి ఎకరాకూ నీరు అందించాలని కోరారు. నీటి చౌర్యానికి పాల్పడుతూ చివరి ఆయకట్టు రైతులకు నీరు అందకుండా చేసే రైతులకు వాస్తవ పరిస్థితిని వివరించాలని చెప్పారు. ప్రాజెక్టు నీటిని దుర్వినియోగం చేసే అవకాశం ఉన్న ప్రాంతాల్లో పోలీసు సాయం తీసుకోవాలని సూచించారు. రెవెన్యూ, పోలీసు, వ్యవసాయ, సాగర్ ప్రాజెక్టు అధికారులు సమన్వయం చేసుకుని ప్రాజెక్టులో నీటిని రైతులందరూ న్యాయబద్ధంగా వినియోగించుకునేలా చూడాలన్నారు. మార్చి నెలాఖరు వరకూ రైతులకు నీరు అందించడమే మొదటి ప్రాధాన్యం అని, ఏప్రిల్‌లో తాగునీటి వినియోగం కోసం ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. ప్రస్తుతం 40 శాతం లోపు నీరున్న చెరువులను నింపేందుకు మాత్రమే ప్రాజెక్టు నీటిని వినియోగించాలని కోరారు. ఇప్పటికే నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న బొల్లాపల్లి మండలానికి నీరు అందించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ గనోరే, డీఆర్వో ఎ.మురళి, నాగార్జునసాగర్ ప్రాజెక్టు చైర్మన్ కాంతారావు, నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎస్‌ఈ కృష్ణమోహన్, జిల్లా వ్యవసాయ అధికారి ఐ.మురళి, ఆర్డీఓ కె.మధులత, జిల్లా ఉద్యాన అధికారి రమణారెడ్డి పాల్గొన్నారు.
తండాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి
జిల్లాలో గిరిజనులు నివాసం ఉండే తండాలలో వారు జీవించేందుకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో గిరిజన ఆవాసాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న జన జాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్–దర్తీ అభ) పథకానికి చెందిన గైడ్‌లైన్స్ గురించి సంబంధిత అధికారులతో సమీక్ష చేశారు. జిల్లాలోని ఎంపీడీవోలకు పలు సూచనలు చేశారు. జిల్లాలోని ఐదు మండలాలైన మాచర్ల, దుర్గి, దాచేపల్లి, అచ్చంపేట, బొల్లాపల్లిలలో 17 రకాలైన సౌకర్యాలు కల్పించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. దీనిలో 17 విభాగాల అధికారులు పాలు పంచుకుంటారన్నారు. కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి కె.జ్యోత్స్న, పశుసంవర్ధకశాఖ పీడీ కాంతారావు, జిల్లా వ్యవసాయాధికారి ఐ.మురళి పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ అరుణ్‌బాబు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి సమీక్ష
Comments
Please login to add a commentAdd a comment