ఊపిరాడక... ఉక్కపోసి...
● ఇదేం చోద్యం ● ఉపకరణాల నిర్ధారణ వైద్య శిబిరంలో అవస్థలు ● ఇరుకు గదుల్లో ప్రత్యేక అవసరాల చిన్నారులకు పరీక్షలు
నరసరావుపేట ఈస్ట్: ప్రత్యేక అవసరాలు గల పిల్లలతో తమకు పనేంటి అనుకున్నారో ఏమో.. ఏ ఒక్క జిల్లా అధికారి అటువైపు కన్నెత్తి చూడలేదు. మానసిక, శారీరక దివ్యాంగులు అవటం వలనేమో నోరు తెరిచి అడగలేరనే ధీమా కాబోలు కనీస సదుపాయాలు కల్పించలేదు. పట్టుమని 50 మందికి కూడా సరిపోని ఇరుకు గదిలో దాదాపు 300 మందికి శిబిరం ఏర్పాటు చేశారు. జిల్లా పాఠశాల విద్యశాఖ సమగ్ర శిక్ష సహిత విద్యావిభాగం ఆధ్వర్యంలో శుక్రవారం ప్రత్యేక అవసరాల విద్యార్థులకు ఉపకరణాలను ఉచితంగా అందించేందుకు నిర్ధారణ శిబిరం నిర్వహించారు. శిబిరాన్ని పాతూరులోని భవిత పాఠశాలలో ఏర్పాటు చేయటంతో ప్రత్యేక అవసరాల చిన్నారులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కనీసం మూడు గదులు కూడా లేని చిన్న పాఠశాలలో జిల్లా పరిధిలోని 11 మండలాలకు చెందిన భవిత పాఠశాలల దివ్యాంగ చిన్నారులకు వైద్య నిర్ధారణ కోసం ఏర్పాటు చేయటం విమర్శలకు తావిచ్చింది. కిక్కిరిసి పోయిన గదుల్లో చిన్నారులు ఊపిరి ఆడక తీవ్ర ఇబ్బందు పడ్డారు. అధికారుల లెక్కల ప్రకారం 161 మంది చిన్నారులకు ఉపకరణాలను నిర్దేశిస్తూ వైద్యులు ధ్రువీకరించారు. చిన్నారులతో పాటు వారి తల్లిదండ్రులు, 11 మండలాలలో భవిత పాఠశాలల్లో పనిచేస్తున్న సిబ్బంది హాజరు కావటంతో గందరగోళ పరిస్థితి కనిపించింది. దీనిపై ఐఈడీ కోఆర్డినేటర్ ఆర్.సెల్వరాజ్‌ను వివరణ కోరగా ఉన్నతాధికారుల ఆదేశాలతో హడావుడిగా క్యాంప్ నిర్వహించాల్సి వచ్చిందన్నారు. మున్సిపల్ పాఠశాలల్లో పరీక్షలు జరుగుతున్న దృష్ట్యా భవిత పాఠశాలలో ఏర్పాటు చేశామని చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment