ప్రేమ, కరుణ ప్రసాదించండి
● విచారణ గురువులు జోసఫ్ బాలసాగర్ ● ఘనంగా మొదలైన సాగర్‌మాత మహోత్సవాలు
విజయపురిసౌత్ : శాంతి, సమాధానం, ప్రేమ, కరుణ, వాత్సల్యాలను భక్తులకు ప్రసాదించాలని సాగర్‌మాత విచారణ గురువులు జోసఫ్ బాలసాగర్ ప్రార్ధించారు. మాచర్ల మండలం విజయపురిసౌత్‌లో శుక్రవారం ప్రారంభమైన సాగర్‌మాత మహోత్సవాలను పురస్కరించుకొని జరిగిన సమష్టి దివ్య బలిపూజ కార్యక్రమంలో ఆయన భక్తులనుద్ధేశించి ప్రసంగించారు. పరిశుద్ధాత్మ అయిన ఏసుక్రీస్తుకు జన్మను ప్రసాదించిన సాగర్‌మాత(మరియమ్మ) ఆశీస్సులు ఎల్లవేళల మీయందరి యందున ఉంటాయని, ఆ తల్లిని భక్తి విశ్వాసాలతో పూజిస్తే కోరికలతోపాటు పాపాలు చెరిగిపోతాయని ఉద్భోదించారు. పరిపూర్ణమైన హృదయంతో, జ్ఞానంతో, వివేకంతో మన తండ్రి అయిన ఏసుక్రీస్తును ప్రార్థించాలని, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలని కోరారు. ఆ తరువాత సాగర్‌మాత మహోత్సవాల సందర్భంగా ఆలయాలను, జపమాల క్షేత్రాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. దీనికి ముందు ఉదయం 5.30గంటలకు సాగర్‌మాత విచారణ గురువులు పామిశెట్టి జోసఫ్ బాలసాగర్‌చే, 6.30గంటలకు గురుశ్రీ జోసఫ్ తంబి అన్నెంచే దివ్యబలిపూజ, 9.30 గంటలకు గోరంట్ల గురుశ్రీ గోపు జోసఫ్‌చే జపమా ల, స్తుతి ఆరాధన, మధ్యాహ్నం ఒంటి గంటకు అన్నదాన కార్యక్రమం, 2గంటలకు గురుశ్రీ గోపు జోసఫ్ చే వాక్య పరిచర్య, స్వస్థత ప్రార్థనలు, సాయంత్రం 5.30గంటలకు గురుశ్రీ ప్రత్తిపాటి మరియదాసుచే జపమాల, నవదిన జపములు, తేరు ప్రదక్షిణ, దివ్యబలిపూజ 7.30గంటలకు కొవ్వొత్తులతో తేరు ప్రదక్షి ణ, రాత్రి 8గంటలకు సాగర్‌మాత కళాకారుల బృందంచే యేసేపు చరిత్ర బుర్రకథ, రాత్రి 9గంటలకు ధనవంతుడు బీదలాజరు బైబిల్ నాటకం ప్రదర్శించారు. 8,9తేదీల్లో కార్యక్రమాలునిర్వహించనున్నా రు.
భారీగా తరలివచ్చిన భక్తులు
వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో విజయపురిసౌత్ కళకళలాడింది. లాంచీస్టేషన్ సెంటర్ నుంచి సాగర్‌మాత దేవాలయం వరకు రోడ్డుకు ఇరువైపుల తినుబండారాల దుకాణాలు, ఫ్యాన్సీ షాపులు, వివిధ రకాల ఆటబొమ్మల షాపులు వెలిశాయి. సాగర్‌మాత ప్రాంగణంలో చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన జెయింట్ వీల్, రంగుల రాట్నాలు ఆకర్షణగా నిలిచాయి. దేవాలయాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు.
ఉచిత వైద్య శిబిరాలు
స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ మెడడికల్ ఆఫీసర్ కెపీ చారి, కొప్పునూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలను ఏర్పాటుచేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. సమృద్ధి ఫౌండేషన్, కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో చలివేంద్రాలను ఏర్పాటు చేశారు.
సాగర్‌మాత తిరునాళ్లకు ప్రత్యేక బస్సులు
మాచర్ల : మాచర్ల ఆర్టీసీ డిపో నుంచి సాగర్‌మాత తిరునాళ్లకు భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తుండటంతో శుక్రవారం ఉదయం నుంచి 15 ప్రత్యేక ఆర్టీసీ బస్సు సర్వీసులు ఏర్పాటు చేసినట్లు డీఎం వీరాస్వామి తెలిపారు. గుంటూరు నుంచి మాచర్లకు రైలులో వచ్చే ప్రయాణికులను సాగర్‌మాతా తిరునాళ్లకు చేర్చేందుకు రైల్వేస్టేషన్ వద్ద ప్రత్యేకంగా మరో ఎనిమిది బస్సులు ఏర్పాటు చేశారు. మరో రెండు రోజులపాటు బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ప్రేమ, కరుణ ప్రసాదించండి
Comments
Please login to add a commentAdd a comment