కూటమి కూసాలు కదిలేలా ఫీజు పోరు
వైఎస్సార్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య
నగరంపాలెం: కూటమి ప్రభుత్వ కూసాలు కదిలేలా ఫీజు పోరుకు తరలిరావాలని వైఎస్సార్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య పిలుపునిచ్చారు. ఈ నెల 12న వైఎస్సార్ సీపీ చేపట్టనున్న ఫీజు పోరుని జయప్రదం చేయాలని కోరుతూ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి క్యాంపు కార్యాలయంలో విద్యార్థి నాయకులతో శనివారం సమావేశం నిర్వహించారు. సమావేశానికి జిల్లా అధ్యక్షుడు చిన్నాబత్తిన వినోద్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పానుగంటి చైతన్య మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లించకపోవడంతో విద్యార్థులను విద్యకు దూరమవుతున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం తక్షణమే కపట నాటకాలు నిలిపివేయాలని అన్నారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ ఆలస్యంకావడంతో చదువులు అర్ధాంతంగా నిలిపివేయాల్సి వస్తోందని వాపోయారు. తద్వారా సామాన్య, మధ్యతరగతి కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు. పిల్లల ఫీజులకు డబ్బులు చెల్లించలేక తల్లిదండ్రులు అప్పులు చేయాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. సమావేశంలో పలు కళాశాలల కమిటీ అధ్యక్షులు మణిచౌదరి, సుభానీ, శ్రీకాంత్, ప్రవీణ్, మస్తాన్‌రెడ్డి, యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు బడే జగదీష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గురిశెట్టి రవి, గంటి, జిల్లా ప్రధాన కార్యదర్శులు మస్తాన్, కరీం, రాజేష్, అజయ్, జిల్లా కార్యదర్శులు సన్ని, రామకృష్ణ, కిరణ్ పాల్గొన్నారు.
మాజీ స్పీకర్ తనయుడిపై
పెట్టిన కేసు రాజీ
●లోక్ అదాలత్‌కు హాజరైన కోడెల శివరామ్
●ఫిర్యాదుదారుడు నాగరాజు రాజీ పడటంతో కేసు కొట్టివేత
నరసరావుపేటటౌన్: మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తనయుడు శివరామ్‌పై పెట్టిన కేసు విషయమై మాజీ రంజీ క్రికెటర్ బుడుమూరి నాగరాజు శనివారం లోక్ అదాలత్‌లో రాజీ పడ్డాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కోడెల తనయుడు, తనయురాలిపై నరసరావుపేట, సత్తెనపల్లిలో నమోదైన బలవంతపు వసూళ్లు, చీటింగ్ కేసులు ఒక్కొక్కటి రాజీమార్గం ద్వారా పరిష్కారం అవుతున్నాయి. ఈ వ్యవహారంలో బాధితులను పోలీసులతో బెదిరించి రాజీ కుదుర్చుకున్నట్లు ఆరోపణలు లేకపోలేదు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన నాగరాజు తన వద్ద కోడెల శివరామ్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.15 లక్షలు తీసుకున్నాడని, ఉద్యోగం రాకపోవటంతో డబ్బులు అడిగితే బెదిరింపులకు పాల్పడ్డాడని గతంలో నాగరాజు టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఆ కేసు జాతీయ లోక్‌అదాలత్ ముందుకు వచ్చింది. నిందితుడిగా కోడెల శివరామ్ హాజరయ్యారు. ఫిర్యాదుదారుడైన నాగరాజు రాజీ పడటంతో కేసును కొట్టివేశారు. అనంతరం నాగరాజు మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ హాయంలో రాజకీయ ఒత్తిళ్ల కారణంగా కేసు పెట్టినట్లు తెలిపాడు. ఇదిలా ఉండగా నాగరాజుపై రాష్ట్రంలోని గుంటూరు, విజయవాడ, వైజాగ్ తదితర ప్రాంతాల్లో చీటింగ్, బ్లాక్‌మెయిలింగ్ కేసులు ఉన్న విషయం తెలిసిందే.
లారీ ఢీకొని యువకుడు మృతి
రాజుపాలెం: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలోని మాచర్ల–గుంటూరు రహదారిపై రెడ్డిగూడెం రైస్‌మిల్లు వద్ద శనివారం రాత్రి జరిగింది. పిడుగురాళ్ల మండలం జూలకల్లు గ్రామానికి చెందిన సంధ్యానాయక్ (26)అనే యువకుడు సత్తెనపల్లి నుంచి పిడుగురాళ్ల వెళుతుండగా అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్‌ఐ కె.వేణుగోపాల్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి మృతదేహాన్ని సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment