అవినీతికి కేరాఫ్ రెవెన్యూ
ఒక్క క్లిక్ చేయండి చాలు.. వాట్సాప్ ద్వారా ప్రజా సేవలన్నీ మీ అరచేతిలోనే ఉన్నాయి.. ఇదంతా ఐటీ మంత్రి లోకేశ్ గొప్పతనమంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రగల్భాలు పలుకుతోంది. క్షేత్రస్థాయిలో మాత్రం ప్రతి విభాగంలో పైసలిస్తేనే ఫైలు కదులుతోంది. ప్రధానంగా రెవెన్యూ శాఖకు దరఖాస్తు చేసుకోవాలంటే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. చేతిలో బరువు పెట్టకపోతే ఫైలు పక్కనపడిపోతోంది. పొలాలు, స్థలాలు సర్వే చేయాలన్నా, మ్యుటేషన్ జరగాలన్నా మూట పక్కన పెడితేనే ముందుకు కదులుతోంది. చివరకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ కోసం కూడా లెక్క కట్టి మరీ వసూళ్లకు పాల్పడుతున్నారు. నరసరావుపేట, రొంపిచర్ల ప్రాంతాల్లో రెవెన్యూ సేవల కోసం వచ్చే ప్రజలకు సిబ్బంది చుక్కలు చూపిస్తున్నారు.
నరసరావుపేట టౌన్: గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు పారదర్శక పాలనతో పాటు 520 సేవలను అందించింది. ఏ సర్టిఫికెట్ కావాలన్నా వలంటీర్ ఇంటికి తీసుకొచ్చి అందించేవారు. ప్రస్తుతం ప్రజలు సచివాలయాల చుట్టూ తిరిగి దరఖాస్తులు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజా సేవలన్నింటిని వాట్సాప్ ద్వారా అరచేతిలోకి తీసుకొస్తున్నామని ప్రకటించింది. దీన్ని ఐటీ మంత్రి, సీఎం కుమారుడు లోకేశ్ అద్భుతంగా ప్లాన్ చేశారని గొప్పగా చెప్పుకొచ్చారు. అయితే, క్షేత్రస్థాయిలో మాత్రం పైసలివ్వనిదే పనులు కావడం లేదు.
రెవెన్యూ సిబ్బందికి కాసుల పంట
నరసరావుపేట మండలంలోని భూముల మ్యుటేషన్, సర్వే కోసం దరఖాస్తు చేసుకుంటే రెవెన్యూ సిబ్బందికి కాసుల పంట పండుతోంది. ముఖ్యంగా నరసరావుపేట మండల సర్వేయర్‌పై తీవ్ర అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. భూ వివాదాలను ఆసరా చేసుకొని లక్షల రూపాయలు గుంజుతున్నారు. కన్వర్షన్ ఫైళ్లల్లో తహసీల్దార్‌కు డబ్బులు ఇవ్వాలని ఆయన బహిరంగంగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు విమర్శలు లేకపోలేదు. ప్రోటోకాల్‌కు ఖర్చు అవుతుందని చెప్పి పలు పనులపై వచ్చే వారి నుంచి ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. దీంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇదే సమయంలో రొంపిచర్ల తహసీల్దార్ కార్యాలయంలోనూ ఇదే తంతు నడుస్తోంది. ఇక్కడ అధికారులు చిన్న చిన్న ధ్రువీకరణ పత్రాలకు సైతం నగదు భారీగా వసూలు చేస్తున్నారు. అధికార పార్టీ నాయకులు సిఫార్స్ చేస్తేనే అక్కడ పనులు జరుగుతున్నాయి.
ఈ తహసీల్దార్ మాకొద్దు !
ఎక్కడా లేని విధంగా ఏకంగా తహసీల్దార్ మా కొద్దు ! అంటూ ఒక ఎమ్మెల్యే కలెక్టర్‌ను బహిరంగంగా కోరడం నరసరావుపేటలో తీవ్ర చర్చనీయాంశమైంది. తహసీల్దార్ కార్యాలయంలో సామాన్యులకు పనులు జరగడం లేదని, రోజుల తరబడి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారని కలెక్టర్ దృష్టికి ఎమ్మెల్యే తీసుకెళ్లారు. కార్యాలయంలో అవినీతి జరుగుతుందని, దీంతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని ఫిర్యాదు చేసినట్లు సమాచారం. నరసరావుపేట తహసీల్దార్ తెలుగుదేశం పార్టీ అండదండలతో సీసీఎల్‌ఏ రూల్స్‌కు విరుద్ధంగా ఇక్కడ పోస్టింగ్ వేయించుకున్నారు. ఈయన స్వగ్రామం రావిపాడు ఇదే మండలంలో ఉంది. సీసీఎల్‌ఏ నిబంధనల ప్రకారం సొంత మండలంలో విధులు నిర్వర్తించకూడదు. కానీ టీడీపీ నేతలు పట్టుబట్టి మరీ దొడ్డిదారిలో డెప్యూటేషన్‌పై తీసుకొచ్చారు. వచ్చినప్పటి నుంచి అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న తహసీల్దార్ వేణుగోపాల్‌పై ఏకంగా ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు ఫిర్యాదు చేయడంపై టీడీపీ అధిష్టానం సమాలోచనలో ఉన్నట్లు తెలిసింది.
మూట ఇస్తేనే మ్యుటేషన్.. కాసులుంటేనే కన్వర్షన్ నరసరావుపేట, రొంపిచర్ల మండలాల్లో రెవెన్యూ లీలలు ప్రతి పనికీ పైసలు వసూలు తాజాగా నరసరావుపేట తహసీల్దార్ వద్దంటూ ఎమ్మెల్యే ఫిర్యాదు రెవెన్యూ అవినీతిపై ప్రజల మండిపాటు
విచారించి చర్యలు తీసుకుంటాం
నరసరావుపేట, రొంపిచర్ల, తహసీల్దార్ కార్యాలయాల్లో అవినీతి, అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. పనుల కోసం ఎవరైనా డబ్బులు అడిగితే తమకు నేరుగా ఫిర్యాదు చేయాలి.
– కె. మధులత, ఆర్డీవో
అవినీతికి కేరాఫ్ రెవెన్యూ
Comments
Please login to add a commentAdd a comment