గుంటూరుకు 100 ఎలక్ట్రిక్ బస్సులు
కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని
నెహ్రూనగర్: కేంద్ర ప్రభుత్వం గుంటూరు పట్టణానికి 100 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించిందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ, చార్జింగ్ పాయింట్లు తదితర ఏర్పాట్ల కోసం ఆదివారం తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, ఆర్టీసీ అధికారులతో కలిసి ఆయన గుంటూరు బస్టాండ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ బస్సులను ఒక్కసారి చార్జింగ్ చేస్తే 200 కిలోమీటర్లు వరకు ప్రయాణించగలవని తెలిపారు. వీటి నిర్వహణకు ప్రత్యేక సదుపాయాలు కావాలని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆర్టీసీ బస్టాండ్ 20 ఎకరాల విస్తీర్ణంలో ఉందని చెప్పారు. బస్టాండ్, ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణకు పోనూ మిగిలిన స్థలాన్ని పీపీపీ పద్ధతిలో లీజులకు ఇస్తే సంస్థకు ఆదాయం పెరిగే అవకాశం ఉందని తెలిపారు. దీనిపై ఆర్టీసీ అధికారులు కసరత్తు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్ కొనకళ్ల నారాయణ, ఈడీ అడ్మిన్ జి. రవివర్మ, ఈడీ జోన్ –3 నెల్లూరు నాగేంద్రప్రసాద్, ఆర్‌ఎం ఎం.రవికాంత్, డిపో మేనేజర్లు, అధికారులు పాల్గొన్నారు.
శ్రీనివాస కల్యాణ వేడుక ఏర్పాట్లు పరిశీలన
వెంకటపాలెం (తాడికొండ): తుళ్లూరు మండలం వెంకటపాలెం గ్రామంలోని టీటీడీ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ఈ నెల 15వ తేదీన జరగనున్న శ్రీనివాస కల్యాణ మహోత్సవ ఏర్పాట్లను గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పరిశీలించారు. సీఎం చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమానికి హాజరుకానున్న నేపథ్యంలో ఆదివారం ఆయన ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలను పరిశీలించారు. ఆలయం వద్ద వాహనాల పార్కింగ్, రాకపోకలకు అనువుగా కేటాయించిన మార్గాలు, వీవీఐపీ, వీఐపీ భక్తులకు ప్రత్యేక మార్గాల కేటాయింపు తదితర అంశాలపై సిబ్బందితో చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎక్కడా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆయన వెంట లా అండ్ ఆర్డర్ అదనపు ఎస్పీ రవికుమార్, తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ, సీఐలు వెంకటేశ్వర్లు, అంజయ్య తదితరులు ఉన్నారు.
17 నుంచి టెన్త్ దూర విద్య హాల్ టికెట్లు పంపిణీ
నరసరావుపేట ఈస్ట్: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ద్వారా ఈనెల 17నుంచి టెన్త్ దూర విద్య హాల్ టికెట్లను సంబంధిత స్టడీ సెంటర్ల ద్వారా పొందవచ్చని జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్. చంద్రకళ ఆదివారం తెలిపారు. మన మిత్ర వాట్సాప్ నంబర్ ద్వారా కూడా అడ్మిషన్ నంబర్, పుట్టిన తేదీని ఉపయోగించి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. హాల్ టికెట్లలో వివరాలను సరి చూసుకోవాలని ఆమె సూచించారు. సార్వత్రిక విద్యాపీఠం వెబ్‌సైట్ నుంచి కూడా పొందవచ్చని ఆమె తెలిపారు.
అవయదానంతో ముగ్గురికి కొత్త జీవితం
గుంటూరు మెడికల్: ఓ మహిళ అవయవాలను కుటుంబ సభ్యులు దానం చేయడానికి అంగీకరించడంతో ముగ్గురికి నూతన జీవితం లభించింది. బాపట్ల జిల్లా బాపట్ల పట్టణం వివేకానంద నగర్ కాలనీకి చెందిన కొప్పనాతి వరలక్ష్మి (45) మెదడు సంబంధిత వ్యాధితో ఈ నెల 6 న గుంటూరులోని ఆస్టర్ రమేష్ హాస్పిటల్‌లో చేరారు. ఆమె పరిస్థితి విషమంగా మారి ఆదివారం బ్రెయిన్ డెడ్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ జీవన్ దాన్ ప్రతినిధులు వరలక్ష్మి కుటుంబసభ్యులకు అవయవదానంపై అవగాహన కల్పించారు. దీంతో వారు విశాల హృదయంతో దానం చేసేందుకు అంగీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment