ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులతో భక్తులకు రక్షణ
విజయపురిసౌత్: ‘‘ఏసు ప్రభువునకు ఎల్లప్పుడూ కృతజ్ఞతా స్తుతులు చెల్లించుట రక్షణదాయకమ’’ని గుంటూరు పీఠాధిపతులు చిన్నాబత్తిని భాగ్యయ్య అన్నారు. సాగర్‌మాత మహోత్సవం ముగింపు రోజైన ఆదివారం నిర్వహించిన సమష్టి దివ్య బలి పూజలో ఆయన భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. పవిత్రాత్మ ప్రభావం వల్ల కన్నె మరియమాత గర్భాన దివ్యజ్యోతి అయిన ఏసుక్రీస్తును ఈ జగతికి ప్రసాదించినట్లు పేర్కొన్నారు. పవిత్రమైన ఏసుక్రీస్తును దీనభావంతో స్తుతించాలని తెలిపారు. ఆధ్యాత్మిక ఆయుధాలైన ప్రార్థన, ప్రేమ, నీతి, కరుణ, దయ, క్షమాగుణం కలిగిన వ్యక్తులు దేవుని మార్గంలో నడిపింపబడుతున్నారని ఆయన పేర్కొన్నారు. సాగర్‌మాత మహోత్సవంలో పాల్గొన్న భక్తులకు దేవుడు ఐశ్వర్య, ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ప్రార్థించారు.
రథోత్సవంతో ఉత్సవాలు ముగింపు
ఆదివారం రాత్రి సాగర్ మాత రథోత్సవం ప్రధానమైంది. ఈ ఊరేగింపుతో ఉత్సవం ముగుస్తుంది. ఉదయం 5గంటలకు అత్తలూరు విచారణ గురువులు చాట్ల కస్సార్, 6గంటలకు కారంపూడి విచారణ గురువులు పెట్లమర్రి అనిల్, 7గంటలకు ముట్లూరు విచారణ గురువులు మార్నేని దిలీప్, 8గంటలకు దాచేపల్లి విచారణ గురువులు ఏరువ బాలశౌర్రెడ్డి, ఉదయం 10.30 గంటలకు గుంటూరు పీఠాధిపతులు చిన్నాబత్తిని భాగయ్య సమష్టి దివ్య పూజలు నిర్వహించారు. పామిశెట్టి తోమస్ బృందం గానం ఆకట్టుకుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు అన్నదానం, 3గంటలకు కోలాటం, బ్యాండ్ మేళం ప్రదర్శన, సాయంత్రం 6గంటలకు సాగర్‌మాత రథోత్సవం, బాణసంచా వెలుగులు ఆకట్టుకున్నాయి. రాత్రి 9 గంటలకు తప్పిపోయిన కుమారుడు బైబిల్ నాటకం ప్రదర్శించారు. వేడుకలలో ఫాదర్స్ జోసఫ్ బాలసాగర్, ఫాదర్ తంబి, మనోజ్‌కుమార్, ఆలయ పెద్దలు ఎం. జోషి, జెక్కిరెడ్డి చిన్నపరెడి, డి. ఇన్నారెడ్డి, కె. శౌర్రాజు, మరియదాసు, శౌరిబాబు, బాలస్వామి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment