రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
మాచర్ల: స్థానిక రింగు రోడ్డు సెంటర్‌లో లారీ బైక్‌కు తగలడంతో ఆదివారం అక్కడికక్కడే ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాలు.. అన్నెబోయన అమరలింగం(39) ఇంటి నుంచి బైక్‌పై సెంటర్‌కు వస్తున్నాడు. ఆంజనేయస్వామి దేవాలయం వద్ద లారీని రివర్స్ చేస్తుండగా బైక్‌కు తగిలింది. దీంతో అమరలింగం లారీ వెనుక టైర్ కింద పడి మృతి చెందాడు. అతడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
గూడ్స్ రైలు కిందపడి టైల్స్ మేస్త్రి ఆత్మహత్య
నరసరావుపేట టౌన్: గూడ్స్ రైలు కిందపడి వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని దొండపాడుకు చెందిన పుట్లూరి శివారెడ్డి(42) పట్టణంలోని బరంపేటలో నివాసం ఉంటున్నాడు. టైల్స్ మేస్త్రిగా జీవనం కొనసాగిస్తున్నాడు. శావల్యాపురం రైల్వే స్టేషన్ సమీపంలో వెల్లలచెరువు ఫ్లైఓవర్ బ్రిడ్జి దగ్గర గూడ్స్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ వెంకటేశ్వరనాయక్ సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు.
15 నుంచి ‘తిరుమల మహా పాదయాత్ర’
పెనుగొండ పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి
తెనాలి: పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలోని శ్రీవాసవీ పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి (బాలస్వామి) ఈ నెల 15వ తేదీ నుంచి ‘తిరుమల మహా పాదయాత్ర’ చేపట్టనున్నారు. రైత్చు క్షేమార్థం, ధర్మసంస్థాపనార్థం చేపట్టనున్న తిరుమల మహాపాదయాత్రను భక్తజన సమూహంగా ఆరంభించనున్నారు. దీనికి ముందుగా తెనాలిలో ‘గురు పాదధూళి’ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం ఆరు గంటలకు స్థానిక గంగానమ్మపేటలోని శ్రీవిద్యాపీఠం శ్రీసాలిగ్రామ పీఠం నుంచి బయలుదేరి బుర్రిపాలెం రోడ్డులోని గోశాల వరకు పాదయాత్ర చేశారు. తిరుమల మహా పాదయాత్ర రోజు వరకు రోజూ గురు పాదధూళి పాదయాత్ర ఉంటుందని, భక్తులు పాల్గొనాలని కోరారు. శ్రీసాలిగ్రామ పీఠం కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
Comments
Please login to add a commentAdd a comment