
ప్రధాని సభకు పటిష్ట ఏర్పాట్లు
గుంటూరు వెస్ట్: మే 2వ తేదీన అమరావతిలోని వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వస్తున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో ఎస్పీ సతీష్ కుమార్, జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసు, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హా లతో కలిసి నిర్వహించిన అధికారుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నోడల్ అధికారులకు విధులు కేటాయించిందన్నారు. జిల్లా అధికారులకు కూడా వారు నిర్వహించాల్సిన విధులపై సూచనలు జారీ చేశామన్నారు. ప్రధాని పర్యటనను అధికారులు ప్రతిష్టగా భావించి విజయవంతం చేయాలన్నారు. ప్రధాన సభలో పాల్గొనే ముందు ప్రధాని రోడ్‌షో ఉంటుందని వాటి ఏర్పాట్లలో ఎటువంటి లోపాలు తలెత్తకుండా చూడాలని పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రాంగణమంతా శానిటేషన్ చక్కగా ఉండాలని చెప్పారు. ప్రాంగణమంతా సుందరీకరణ చేయాలన్నారు. అవసరమైన సిబ్బందిని ఆయా శాఖలు నియమించుకోవాలన్నారు. సభా ప్రాంతంలో సీటింగ్ ఏర్పాటుతో పాటు మంచినీరు, స్నాక్స్ ఏర్పాటు చేయాలన్నారు.
రూట్‌మ్యాప్‌పై అవగాహన ఉండాలి..
కార్యక్రమానికి సంబంధించి రూట్ మ్యాప్‌పై అధికారులకు స్పష్టమైన అవగాహన ఉండాలన్నారు. కార్యక్రమం ప్రారంభం నుంచి ముగింపు వరకు విద్యుత్ సరఫరాలో ఎటువంటి లోపాలు ఉండకూడదని తెలిపారు. వాహనాల పార్కింగ్‌కు 5 ప్రాంతాలు గుర్తించామని తెలిపారు. ఆయా ప్రాంతాల్లోనే వాహనాలు పార్క్ చేసే విధంగా చూడాలని తెలిపారు. బ్యారికేడ్లు, మొబైల్ టాయ్‌లెట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రధాని కార్యక్రమానికి భారీ స్థాయిలో ప్రజలు హాజరవుతారని, వారు సురక్షితంగా ఇంటికి చేరే వరకు అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వివరించారు. అడిషన్ ఎస్పీ సుప్రజ, డీఆర్‌ఓ ఖాజావలి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎం.గంగరాజు, జడ్పీ సీఈఓ జ్యోతిబసు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
పర్యటన ఏర్పాట్లు పరిశీలన..
జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి
వెలగపూడి(తాడికొండ): మే 2వ తేదీన తుళ్ళూరు మండలం వెలగపూడి సచివాలయం సమీపంలో వివిధ శంకుస్థాపన కార్యక్రమాల్లో ప్రధాని మోదీ పాల్గొననున్న నేపధ్యంలో ఏర్పాట్లను బుధవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వీర పాండియన్, జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్, సంయుక్త కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ, ఆయుష్ కమిషనర్ దినేష్ కుమార్, పలువురు అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా హెలిప్యాడ్, సభా ప్రాంగణం వద్ద చేపట్టాల్సిన ఏర్పాట్లు, వీవీఐపీలు ప్రయాణించే మార్గాలకు సంబంధించిన ప్రాంతాలను పరిశీలించి చేపట్టాల్సిన చర్యలపై సూచనలు జారీ చేశారు. సీఆర్డీఏ అదనపు కమిషనర్లు నవీన్, ప్రవీణ్ చంద్, ఆర్‌డీఓ శ్రీనివాసరావు, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ శ్రీనివాసమూర్తి, సీఆర్డీఏ, రెవెన్యూ, పోలీసు అధికారులు పాల్గొన్నారు.